లాభాల కోసమే ఓపెన్ఏఐ.. సంస్థను దోచుకుంటున్నారు: ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు

Elon Musk accuses OpenAI Sam Altman of betraying nonprofit roots in court trial
  • ఓపెన్ఏఐపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కోర్టులో వాంగ్మూలం
  • లాభాపేక్షతో సంస్థ వ్యవస్థాపక లక్ష్యాలను పక్కన పెట్టిందని ఆరోపణ
  • నిధుల కోసమే వాణిజ్యపరమైన మార్పులు అవసరమయ్యాయని ఓపెన్ఏఐ వాదన
  • ఈ కేసులో తీర్పు ఏఐ కంపెనీల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం
  • వ్యక్తిగత లాభం కోసం కాకుండా, సంస్థాగత మార్పుల కోసమే పోరాడుతున్నానన్న మస్క్
ప్రముఖ కృత్రిమ మేధస్సు (AI) సంస్థ ఓపెన్ఏఐ, దాని సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌పై టెస్లా, ఎక్స్‌ఏఐ (xAI) సీఈవో ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓపెన్ఏఐ తన వ్యవస్థాపక లాభాపేక్ష రహిత (nonprofit) లక్ష్యాన్ని విడిచిపెట్టి, పూర్తిగా వాణిజ్య ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. అమెరికాలోని ఓక్‌లాండ్ ఫెడరల్ కోర్టులో జరుగుతున్న ఈ కీలక విచారణలో మస్క్ తన వాంగ్మూలాన్ని వినిపించారు.

మానవాళి ప్రయోజనాల కోసం సురక్షితమైన ఏఐని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఓపెన్ఏఐ ప్రారంభమైందని, కానీ ఇప్పుడు అది ఇతర టెక్ దిగ్గజాలతో పోటీ పడుతూ లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తోందని మస్క్ తన వాదనలో పేర్కొన్నారు. సంస్థ ప్రారంభ దశలో తాను ఆర్థికంగా మద్దతు ఇచ్చింది, అది ఒక లాభాపేక్ష రహిత సంస్థగా, పారదర్శకంగా ఉంటుందనే నమ్మకంతోనే అని ఆయన స్పష్టం చేశారు. ఒక స్వచ్ఛంద సంస్థను 'దోచుకోవడం' సరైందేనని కోర్టు తీర్పు ఇస్తే, అది అమెరికాలోని దాతృత్వ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ భద్రతపై గూగుల్ పెద్దగా దృష్టి పెట్టడం లేదనే భావనతోనే తాను ఓపెన్ఏఐ ఏర్పాటులో పాలుపంచుకున్నట్లు వివరించారు.

సంస్థ ప్రారంభంలో ప్రతిభావంతులను నియమించుకోవడంలో, ఇతర టెక్ భాగస్వాములతో సంబంధాలు నెలకొల్పడంలో తాను కీలక పాత్ర పోషించానని మస్క్ కోర్టుకు తెలిపారు.

మ‌స్క్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన ఓపెన్ఏఐ 
మరోవైపు ఓపెన్ఏఐ ఈ ఆరోపణలను ఖండించింది. అధునాతన ఏఐ పరిశోధనలకు అయ్యే భారీ ఖర్చులను భరించడానికే పరిమిత-లాభాల (capped-profit) నమూనాకు మారాల్సి వచ్చిందని వివరించింది. సంస్థపై తుది నియంత్రణ ఇప్పటికీ లాభాపేక్ష రహిత విభాగం చేతిలోనే ఉందని స్పష్టం చేసింది.

2015లో ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న మస్క్, 2018లో సంస్థ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాతే ఓపెన్ఏఐ వాణిజ్య విభాగాన్ని ఏర్పాటు చేసి మైక్రోసాఫ్ట్ వంటి సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు ఆకర్షించింది. చాట్‌జీపీటీ విజయంతో ప్రపంచ ఏఐ రంగంలో అగ్రగామిగా నిలిచింది. ఓపెన్ఏఐతో విభేదించిన తర్వాత మస్క్ సొంతంగా 'xAI' పేరుతో మరో ఏఐ సంస్థను ప్రారంభించారు. ఈ కేసులో తనకు ఎలాంటి ఆర్థిక పరిహారం అవసరం లేదని, ఓపెన్ఏఐలో కేవలం వ్యవస్థాగత మార్పులనే కోరుతున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే కొద్ది వారాల్లో కోర్టు వెలువరించబోయే తీర్పు, భవిష్యత్తులో ఏఐ సంస్థల పాలన, నిధుల సమీకరణ నమూనాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Go Back to Shorts
Elon Musk
OpenAI
Sam Altman
nonprofit roots
court trial

More Telugu News