విశాఖలో రైల్వే జోన్ తాత్కాలిక కార్యాలయాన్ని సందర్శించిన చంద్రబాబు, అశ్వినీ వైష్ణవ్

Chandrababu and Ashwini Vaishnaw visits Coastal Railway Zone Temporary office in Vizag
  • ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష
  • 2026 జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభించాలని విజ్ఞప్తి
  • కొత్త జోన్‌లో అరకు-కొత్తవలస, కర్నూలు-డోన్ సెక్షన్లను విలీనం చేయాలని సూచన
దక్షిణ కోస్తా రైల్వే జోన్ (ఎస్ సీఓఆర్) కార్యకలాపాలను ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు విశాఖపట్నంలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రైల్వే జోన్ కార్యాలయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి ఆయన సందర్శించారు.

అనంతరం ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రితో కలిసి దక్షిణ మధ్య, తూర్పు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు కొత్త జోన్ కార్యకలాపాలు, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేశారు. కొత్తగా ఏర్పాటవుతున్న జోన్‌లో కొన్ని పాలనాపరమైన మార్పులు చేయాలని, మరికొన్ని సెక్షన్లను విలీనం చేయాలని కోరారు. ముఖ్యంగా ఏపీ రాష్ట్ర పరిధిలోని అరకు - కొత్తవలస, కర్నూలు - డోన్ సెక్షన్లను కొత్త జోన్‌లో కలపడం ద్వారా ఆయా ప్రాంతాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని వివరించారు. రాష్ట్రంలో రైల్ రూట్ డెన్సిటీ తక్కువగా ఉండటం వల్ల ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యానికి ఇబ్బంది కలుగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పోర్టుల పరిధిలో ఉన్న ఇతర రాష్ట్రాల హింటర్ ల్యాండ్‌ను రైల్వే మార్గాల ద్వారా కనెక్ట్ చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.


Go Back to Shorts
Chandrababu
Ashwini Vaishnaw
Coastal Railway Zone
SCoR
Vizag

More Telugu News