ధనుష్ 'కర' ఈవెంట్‌లో 'పెద్ది' అప్‌డేట్.. విడుదల తేదీ చెప్పేసిన దర్శకుడు బుచ్చిబాబు

  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతకు తెర
  • జూన్ 25న చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారిక ప్రకటన
  • ధనుష్ 'కర' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తేదీని వెల్లడించిన దర్శకుడు బుచ్చిబాబు
  • ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమాపై భారీ అంచనాలు
  • షూటింగ్ చివరి దశలో ఉందని.. ఐటమ్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని వెల్లడి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న 'పెద్ది' సినిమా విడుద‌ల‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎన్నో అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా విడుద‌ల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఆయన అధికారికంగా వెల్లడించారు.

ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ధనుష్ 'కర' తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన దర్శకుడు బుచ్చిబాబు ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతున్న సమయంలో 'పెద్ది' అప్‌డేట్ ఇవ్వాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున కోరడంతో బుచ్చిబాబు స్పందించారు. ప్రస్తుతం 'పెద్ది' సినిమా ఐటమ్ సాంగ్ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పటికీ, ధనుష్ కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చానని తెలిపారు. అభిమానుల కోరిక మేరకు సినిమా విడుదల తేదీని ఆ వేదికపైనే ప్రకటించారు.

వాస్తవానికి 'పెద్ది' సినిమాను మొదట మార్చి 27న, ఆ తర్వాత ఏప్రిల్ 30న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే, చిత్రీకరణలో జాప్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికానందున రెండుసార్లు వాయిదా పడింది. దీంతో కొత్త విడుదల తేదీ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దర్శకుడి ప్రకటనతో వారి నిరీక్షణకు తెర‌ప‌డిన‌ట్ల‌యింది.

ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తో క‌లిసి ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Buchi Babu
Ram Charan
Peddi Movie
Janhvi Kapoor
AR Rahman
Telugu Cinema Release Date
Shivaraj Kumar
Sukumar Writings
Vridhi Cinemas
Mythri Movie Makers

More Telugu News