ట్రంప్‌పై పగ, వీసా కష్టాలు.. 'గాయపడ్డ సింహం'లో యూత్ కు కనెక్ట్ అయ్యే అంశాలు

Gayapadina Simham Movie Tarun Bhascker as Youth Fighting Trump Visa Issues
  • హీరోగా తరుణ్ భాస్కర్.. 'గాయపడ్డ సింహం'తో ప్రేక్షకుల ముందుకు
  • అమెరికా కలను దెబ్బతీసిన ట్రంప్‌పై రివెంజ్ తీర్చుకునే యువకుడి కథ
  • యువత వీసా కష్టాలను హాస్యభరితంగా చూపించే ప్రయత్నం
  • ప్రతినాయకుడిగా జేడీ చక్రవర్తి.. కీలక పాత్రలో ఫరియా అబ్దుల్లా
  • మే 1న సినిమా విడుదల
ప్రస్తుత యువతరం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కలలను ప్రతిబింబించే కథలకు ప్రేక్షకులు ఎప్పుడూ కనెక్ట్ అవుతారు. సరిగ్గా అలాంటి యూత్‌ఫుల్ పాయింట్‌తో, దానికి వినోదాన్ని జోడించి వస్తున్న చిత్రమే 'గాయపడ్డ సింహం'. దర్శకుడు తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా, అమెరికా వెళ్లాలని కలలు కనే ఓ యువకుడి కథగా రూపుదిద్దుకుంది.

చిన్నప్పటి నుంచి అమెరికా వెళ్లాలనే బలమైన ఆశయంతో ఉండే హీరో, ఎట్టకేలకు తన కలను నిజం చేసుకునే సమయానికి ఊహించని షాక్ తగులుతుంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన అతిపెద్ద బహిష్కరణ (డిపోర్టేషన్) నిర్ణయంతో హీరో కలలన్నీ భగ్నం అవుతాయి. తన ఆశలను అడియాసలు చేసిన ట్రంప్‌పై ఆ యువకుడు ఎలా పగ తీర్చుకున్నాడు అనేదే ఈ సినిమా కథాంశం. ఈ రివెంజ్ డ్రామాను పూర్తి వినోదాత్మకంగా మలిచినట్లు తెలుస్తోంది.

ఈ కథలో ప్రేమకథ కూడా కీలకమే. హీరో ప్రేమించిన అమ్మాయి (మానస చౌదరి) తండ్రి, అల్లుడు అమెరికాలో స్థిరపడాలని షరతు పెడతాడు. ఒకవైపు ట్రంప్ ఆంక్షలు, మరోవైపు మామగారి షరతుతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడనేది హాస్యాన్ని పండించనుంది. భారతీయ యువత వీసా కోసం పడే కష్టాలను ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించనున్నారు.

కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, శుభలేఖ సుధాకర్, ఫరియా అబ్దుల్లా కీలక పాత్రల్లో నటించారు. సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మే 1న థియేటర్లలోకి రానుంది.
Go Back to Shorts
Tarun Bhascker
Gayapadina Simham
Donald Trump
US Visa
Youth
America
Manasa Choudary
Telugu Movie
Revenge Drama
Deportation

More Telugu News