‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా చంద్రబాబు.. ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు

  • సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం
  • ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్‌లో ప్రతిష్ఠాత్మక గౌరవం
  • ఇది ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు
  • సీఎం సంస్కరణలు, దార్శనికతకు గుర్తింపు అని హర్షం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో అరుదైన గౌరవం అందుకున్నారు. దేశ ఆర్థిక రంగంలో ప్రతిష్టాత్మకమైన 'ది ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్ ఫర్ కార్పొరేట్ ఎక్సలెన్స్' కార్యక్రమంలో ఆయన 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు రావడం పట్ల రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, కింజరాపు అచ్చెన్నాయుడు, అనిత హర్షం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, "ఇది ఒక గొప్ప క్షణం. ముఖ్యమంత్రి దార్శనికత, సంస్కరణలు, అమలు తీరుకు ఇది నిదర్శనం. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది" అని పేర్కొన్నారు.

ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం అమలు చేస్తున్న పారదర్శక విధానాలు, సంస్కరణలకు ఈ పురస్కారం తార్కాణమని తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహం, ఉద్యోగాల కల్పనలో ముఖ్యమంత్రి దూరదృష్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని వివరించారు.

హోంమంత్రి అనిత స్పందిస్తూ, ఇది ఏపీకి వస్తున్న పెట్టుబడులకు, రాష్ట్రంలో ఉన్న 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'కు వచ్చిన అవార్డు అని అభివర్ణించారు. ఈ పురస్కారం రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు మరిన్ని పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

Chandrababu Naidu
Andhra Pradesh
Business Reformer of the Year
Economic Times Awards
Corporate Excellence
Nara Lokesh
Kinjerapu Atchannaidu
Anita
AP Investments

More Telugu News