చెన్నై పేస‌ర్ ముకేశ్ చౌదరి ఇంట విషాదం.. అండగా నిలిచిన ధోనీ

  • సీఎస్‌కే పేసర్ ముకేశ్ చౌదరి తల్లి అనారోగ్యంతో కన్నుమూత
  • ముకేశ్‌కు అండగా నిలిచిన ధోనీ.. ఆసుపత్రికి వెళ్లి పరామర్శ
  • తల్లి అంత్యక్రియలు ముగించి తిరిగి జట్టుతో చేరిన ముకేశ్
  • గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ.. నెట్స్‌లో తీవ్రంగా సాధన
చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) శిబిరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ ముకేశ్ చౌదరి తల్లి ప్రేమ్ దేవి మంగళవారం కన్నుమూశారు. గతేడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ముంబైలోని టాటా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియగానే సీఎస్‌కే యాజమాన్యం, ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దైనిక్ భాస్కర్ కథనం ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే ముకేశ్ తన స్వస్థలమైన రాజస్థాన్‌లోని భిల్వారాకు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. తన అన్న డాక్టర్ రాజేశ్ చౌదరితో కలిసి తల్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషాద సమయంలో ముకేశ్‌కు కెప్టెన్ ఎంఎస్ ధోనీ అండగా నిలిచిన తీరు అందరినీ కదిలించింది. ధోనీ నిరంతరం ముకేశ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ధైర్యం చెప్పడమే కాకుండా, సమయం తీసుకుని ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించాడు. కష్టకాలంలో తోటి ఆటగాడికి అండగా నిలిచి ధోనీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

తల్లి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం ముకేశ్ చౌదరి తిరిగి జట్టుతో చేరినట్టు సమాచారం. అయితే, అతను చిన్న విరామం తీసుకుని పంజాబ్ కింగ్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడ‌ని స‌మాచారం. ఈ సీజన్‌లో ముకేశ్ ఇప్పటివరకు ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు.

నెట్స్‌లో ధోనీ సాధన
మరోవైపు గాయం కారణంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని ఎంఎస్ ధోనీ, తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. టోర్నమెంట్‌కు ముందు పిక్కల కండరాల నొప్పితో బాధపడిన ధోనీ, ప్రస్తుతం కోలుకుంటున్నాడు. మంగళవారం జరిగిన ట్రైనింగ్ సెషన్‌లో అతను పూర్తిస్థాయిలో పాల్గొని వికెట్ కీపింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. బుధవారం కూడా దాదాపు గంటపాటు నెట్స్‌లో ఫాస్ట్ బౌలర్లు, త్రోడౌన్ స్పెషలిస్టుల బౌలింగ్‌ను ఎదుర్కొన్నాడు. కొన్ని బంతులను సిక్సర్లుగా మలిచినప్పటికీ, మరికొన్నింటిని కనెక్ట్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. ధోనీ ఫిట్‌నెస్‌పై మెడికల్ టీం, ధోనీ పూర్తి సంతృప్తిగా ఉన్నప్పుడే అతని పునరాగమనం ఉంటుందని బౌలింగ్ కోచ్ ఎరిక్ సైమన్స్ తెలిపాడు.

ఇదే సమయంలో మైదానంలో ఐపీఎల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఏఐ (AI) రోబోటిక్ డాగ్‌ను చూసిన ధోనీ, దానితో సరదాగా గడిపాడు. దానితో సైగలు చేస్తూ ఆడించడం అందరినీ ఆకట్టుకుంది.

Mukesh Choudhary
MS Dhoni
CSK
IPL 2026

More Telugu News