కరిగిపోతున్న కల.. అమెరికాను వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు

Indian Americans Leaving US 40 Percent Considering Exit
  • కార్నెగీ ఎండోమెంట్ సర్వేలో కీలక విషయాలు
  • రాజకీయ అస్థిరత కారణంగా వెళ్లిపోవాలనుకుంటున్న 58 శాతం మంది భారతీయులు
  • రెండోసారి ట్రంప్ పాలనపై 71 శాతం మంది అసంతృప్తి
చాలామంది భారతీయులకు, నిన్నటి వరకు అమెరికా అంతిమ గమ్యస్థానంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంతోమంది మది నుంచి అమెరికా 'కల' నెమ్మదిగా కనుమరుగవుతోంది. అంతర్జాతీయ సంస్థ 'కార్నెగీ ఎండోమెంట్' నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, భారతీయ అమెరికన్ సమాజంలో రోజురోజుకీ ఆందోళన పెరుగుతోంది. ఎంతోమంది ఇప్పుడు అమెరికాను విడిచి వెళ్లాలనుకుంటున్నారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల కారణంగా 40 శాతం మంది భారతీయ అమెరికన్లు అగ్రరాజ్యం నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ఆలోచిస్తున్నారని సర్వేలో వెల్లడైంది.

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన అనుసరిస్తున్న విధానాలు వలసదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో జీవన విధానాలు, ట్రంప్ ప్రభుత్వం తీరుపై యూగోవ్‌తో కలిసి కార్నెగీ ఎండోమెంట్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

వివిధ కారణాల వల్ల, ప్రతి 10 మందిలో నలుగురు భారతీయులు అమెరికాను వీడాలనుకుంటున్నారు. రాజకీయ అస్థిరత కారణంగా తాము వెళ్లాలనుకుంటున్న వారు 58 శాతం మంది ఉన్నారు. జీవన వ్యయం కారణంగా 54 శాతం, వ్యక్తిగత భద్రత ఆందోళనతో 41 శాతం మంది అమెరికాను వీడాలని భావిస్తున్నారు. రెండోసారి ట్రంప్ పాలనపై తాము అసంతృప్తితో ఉన్నట్లు 71 శాతం మంది తెలిపారు. 2024-25 గణాంకాల ప్రకారం, అమెరికాలో 54 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. అమెరికాలో వీరి వాటా 1.5 శాతంగా ఉంది.

ట్రంప్ అధికారంలోకి రాకముందు నుంచే అమెరికాకు అక్రమ వలసలు తగ్గుముఖం పట్టాయని ఈ సర్వే తెలిపింది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక చట్టబద్ధ వలసలు భారీగా తగ్గినట్లు ఈ సర్వే తెలిపింది. అత్యధికంగా హెచ్1బీ వీసాలపై ఈ ప్రభావం కనిపించింది. గత సంవత్సరంలో ఈ వీసాల జారీ 25 శాతం మేర తగ్గిందని తెలిపింది. లక్ష డాలర్ల ఫీజు అమల్లోకి వచ్చాక వీసాల కోసం కంపెనీల నుంచి పిటిషన్లు 87 శాతం తగ్గుముఖం పట్టినట్లు ఈ సర్వే తన నివేదికలో తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హెచ్1బీ వీసాలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది.
Go Back to Shorts
Indian Americans
United States
America
Donald Trump
H1B visa
immigration
political instability

More Telugu News