లక్నోపై రాజస్థాన్ ఘన విజయం.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి 'రాయల్స్'

Rajasthan Royals wins the match against Lucknow super giants
  • సొంత మైదానంలో 40 పరుగుల తేడాతో ఓడిపోయిన లక్నో
  • తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులు చేసిన రాజస్థాన్
  • 119 పరుగులకే కుప్పకూలిన లక్నో సూపర్ జెయింట్స్
రాజస్థాన్ రాయల్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ తన సొంత మైదానంలో ఓటమి చవిచూసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి ఏక్నా క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ 40 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా, 160 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి దిగిన లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది. లక్నో చివరలో 15 పరుగుల తేడాలో ఐదు వికెట్లను కోల్పోయింది.

లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 159 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో లక్నో బౌలర్ మయాంక్ అగర్వాల్ ఏకంగా 20 పరుగులు ఇచ్చాడు. దీనితో రాజస్థాన్ స్కోర్ 150 దాటింది.

ప్రారంభంలో దూకుడు మీదున్న జైశ్వాల్‌ను మహమ్మద్ షమీ పెవిలియన్‌కు పంపించాడు. మూడో ఓవర్ వేసిన షమీ వరుస బంతుల్లో జైశ్వాల్, ధ్రువ్ జురెల్‌లను ఔట్ చేశాడు. దీంతో రాజస్థాన్ ఆట నెమ్మదించింది. షమీ, ప్రిన్స్ యాదవ్, మోహ్సిన్ ఖాన్ తలా రెండు వికెట్లు తీశారు. రాజస్థాన్ ఆటగాళ్లలో రవీంద్ర జడెజా (43), జైస్వాల్ (22), హెట్మెయర్ (22) శివమ్ దుబే (19) పరుగులు చేశారు.

ఆ తర్వాత ఛేదన ప్రారంభించిన లక్నో మొదటి రెండు ఓవర్లలోనే కీలక రెండు వికెట్లను కోల్పోయింది. నాంద్రే బర్గర్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. లక్నో ఆటగాళ్లలో మిచెల్ మార్ష్ 41 బంతుల్లో 55 పరుగులు చేసి రాణించాడు. మిగిలిన వారు ఎవరూ ఉత్తమ ప్రదర్శన కనబరచలేదు. జోఫ్రా ఆర్చర్ 3, బ్రిజేష్ శర్మ, నాంద్రే బర్గర్ రెండేసి వికెట్ల చొప్పున తీసుకున్నారు.

పంజాబ్ కింగ్స్ ఆరు మ్యాచ్‌లకు గాను ఐదింట గెలిచి 11 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు 4 పాయింట్లతో బెంగళూరు, హైదరాబాద్, రాజస్థాన్ రెండు, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. లక్నోపై విజయం సాధించడంతో మొత్తం పది పాయింట్లు సాధించిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
Go Back to Shorts
Rajasthan Royals wins
Lucknow super giants

More Telugu News