ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వ వైభవం: సీఎం చంద్రబాబు

Chandrababu press meet in Chennai
  • తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
  • చెన్నైలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి మీడియా సమావేశం
  • డీలిమిటేషన్‌పై డీఎంకే, కాంగ్రెస్ తీరును ఎండగట్టిన చంద్రబాబు
  • మహిళా రిజర్వేషన్లను అడ్డుకుని దక్షిణాదికి నష్టం చేశారని ఆవేదన
  • మాతృభాషను గౌరవిద్దాం.. ఇతర భాషలపై ద్వేషం వద్దని హితవు
అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగాల కల్పన జరగాలంటే అది ఒక్క ఎన్డీఏతోనే సాధ్యమని, తమిళనాడు రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురాగల శక్తి ఎన్డీఏ కూటమికి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాడు చెన్నైలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా డీఎంకే, కాంగ్రెస్ పార్టీల వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమిళనాడు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల వల్ల రాష్ట్రం ఎలా నష్టపోతుందో వివరించారు.

రాహుల్, స్టాలిన్ దీని ద్వారా ఏం సాధించారు?
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల విషయంలో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశాయని చంద్రబాబు ఆరోపించారు. "మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రాన్ని ఓడించామని డీఎంకే, కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ వంటి పార్టీలు భావిస్తున్నాయి. కానీ వాస్తవానికి వారు ఈ దేశ మహిళలను, దక్షిణాది రాష్ట్రాలను ఓడించారు. జనాభాతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50 శాతం పెంచాలనేది కేంద్రం ప్రతిపాదన. ఆ పెరిగిన సీట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వస్తాయి. దీనివల్ల దక్షిణాదికి ఎలాంటి నష్టం లేదు. ఈ ఫార్ములా కంటే మెరుగైనది మరొకటి ఉంటుందా? అయినా, కేవలం రాజకీయ కారణాలతో ఈ రెండు బిల్లులను అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ, స్టాలిన్ దీని ద్వారా ఏం సాధించారు?" అని చంద్రబాబు ప్రశ్నించారు.

"సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేను దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఎందుకు ఆలోచిస్తాను? నేను దక్షిణాది వైపే మాట్లాడుతున్నాను. 2001లో వాజ్‌పేయి హయాంలో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రతిపాదన వస్తే, అది దక్షిణాదికి నష్టమని చెప్పి నేనే ఆపించాను. ఈ విషయాన్ని ఇండియా కూటమి పార్టీలు గుర్తుంచుకోవాలి" అని ఆయన స్పష్టం చేశారు.

తమిళనాడుకు గత వైభవమేదీ?
ఒకప్పుడు దక్షిణ భారతదేశానికే కేంద్రంగా ఉన్న చెన్నై, ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలతో పోటీ పడలేకపోతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. "తమిళనాడులో అభివృద్ధి ఆగిపోయింది. శాంతిభద్రతలు క్షీణించాయి. మహిళలపై నేరాలు, కస్టోడియల్ మరణాలు, డ్రగ్స్ వాడకం పెరిగిపోయాయి. గతంలో తమిళనాడుకు గొప్ప చరిత్ర ఉండేది. కానీ ఇప్పుడా పరిస్థితి ఉందా? జరిగిన కొద్దిపాటి అభివృద్ధి కూడా కేంద్ర నిధుల వల్లే. చెన్నై రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, చెన్నై-బెంగళూరు-అమరావతి హైస్పీడ్ రైలు కారిడార్ వంటివి కేంద్రం చొరవే. డీఎంకే లాంటి పార్టీల వల్ల రాష్ట్రం వెనుకబడుతోంది" అని విమర్శించారు.

ఇప్పుడు ఏపీని చూడండి
కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఎలా అభివృద్ధి పథంలో పయనిస్తోందో చంద్రబాబు వివరించారు. "దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి. డబ్బులు లేకున్నా, ల్యాండ్ పూలింగ్ వంటి వినూత్న పద్ధతిలో రాజధాని నిర్మిస్తున్నాం. ఇదంతా కేంద్రం సహకారంతోనే సాధ్యమైంది. తమిళనాడులోనూ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బుల్లెట్ స్పీడ్‌తో అభివృద్ధి జరుగుతుంది" అని ఆయన భరోసా ఇచ్చారు.

భాషా రాజకీయాలు వద్దు
ప్రధాని మోదీపై వ్యతిరేకతతో భాషాపరమైన బేధాలు సృష్టించడం సరికాదని చంద్రబాబు హితవు పలికారు. "మాతృభాషను గౌరవించాలి, కానీ ఇతర భాషలపై ద్వేషం వద్దు. హిందీని కేంద్రం జాతీయ భాషగా ప్రకటించలేదు. ప్రధాని మోదీ సైతం మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని చెబుతున్నారు. భాష పేరుతో అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు" అని అన్నారు. నదుల అనుసంధానం ద్వారా తమిళనాడు నీటి కష్టాలు తీరతాయని, అది ఎన్డీఏతోనే సాధ్యమని తెలిపారు. తిరువళ్లువార్ నుంచి అబ్దుల్ కలాం వరకు ఎందరో మహనీయులు పుట్టిన ఈ గడ్డపై ప్రజలు పురోగామి ఆలోచనలతో ఎన్డీఏకు మద్దతివ్వాలని కోరారు.
Go Back to Shorts
Chandrababu
NDA
Tamil Nadu Elections
Chennai
AIADMK
BJP
DMK
Congress
TDP
Andhra Pradesh

More Telugu News