రేవంత్ రెడ్డి మొదటి నుంచి సీమాంధ్ర నేతల చేతుల్లో కీలుబొమ్మ: జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Jeevan Reddy lashes out at Revanth Reddy
  • 2015లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రతో ఓటుకు నోటు కేసులో దొరికిపోయారని ఆరోపణ
  • మేం పాలన మార్పు కోరుకుంటున్నాం కానీ రేవంత్ రెడ్డికి కీడు జరగాలని కోరుకోవడం లేదని వ్యాఖ్య
  • కేసీఆర్ లేకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్న
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకులకు తొత్తుగా మారిపోయారని నిన్న బీఆర్ఎస్ పార్టీలో చేరిన జగిత్యాల సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి విమర్శించారు. ఆయన మొదటి నుంచి సీమాంధ్ర నాయకుల చేతిలో కీలుబొమ్మగానే ఉంటున్నారని అన్నారు. 2015లో నాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రతో, వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీగా చేయాలనే ఉద్దేశంతో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి దొరికిపోయారని పేర్కొన్నారు. ఆయనకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదని విమర్శించారు. ఆయన ఆంధ్రా తొత్తులా మారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్నారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి పాలన పోయి కేసీఆర్ పాలన రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మేం పాలన మార్పు కోరుకున్నాం తప్ప, భౌతికంగా రేవంత్ రెడ్డి కీడును తాము కోరుకోలేదని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే అన్నారు. కేసీఆర్ ఉద్యమించకుంటే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. అలాంటి ఉద్యమనాయకుడిని పట్టుకుని ఉరితీస్తానని అంటావా అని ప్రశ్నించారు.

జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ సమయంలోనే రేవంత్ రెడ్డి కావాలని మేడిగడ్డ పర్యటనను పెట్టుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని, కానీ రేవంత్ రెడ్డి తానే ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటానని చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అన్నీ గమనిస్తోందని తెలిపారు. రేవంత్ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరారని... ఎన్డీఏకు, రేవంత్ రెడ్డికి మధ్య చంద్రబాబు వారధిగా ఉన్నారని అన్నారు. తనను చంద్రబాబు కాపాడుతారని ఆయన భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ అధిష్ఠానం ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావడంలేదని అన్నారు.

నాదెండ్ల భాస్కరరావు అంశం గురించి రేవంత్ రెడ్డి తెలియకుండా మాట్లాడుతున్నారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు నాదెండ్ల భాస్కరరావుకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. ఆయనకు మద్దతుగా తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని వెల్లడించారు. తనను ఎవరూ తొలగించలేదని, తనంతట తానే రాజీనామా చేశానని అన్నారు. తనతో పాటు ఇందిరాగాంధీ, కాంగ్రెస్ సహా అందరూ నాదెండ్లకు మద్దతుగా నిలిచారని వెల్లడించారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియదేమో అని విమర్శించారు.
Go Back to Shorts
Jeevan Reddy Press Meet
jeevan reddy takes on Revanth Reddy

More Telugu News