ఎట్టకేలకు ముంబై మళ్లీ గెలిచింది... గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ

Mumbai Indians beat Gujarat Titans by 99 runs
  • వరుసగా 4 ఓటముల తర్వాత గెలిచిన ముంబై ఇండియన్స్
  • విధ్వంసక సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ
  • చేధనలో చేతులెత్తేసిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు
  • నాలుగు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించిన అశ్వని కుమార్
  • గుజరాత్‌పై 99 పరుగుల భారీ తేడాతో ముంబై ఘన విజయం
  • ఎట్టకేలకు ఈ సీజన్ లో తొలి వికెట్ తీసిన బుమ్రా
 ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు భారీ విజయంతో ఊపిరి పీల్చుకుంది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత బరిలోకి దిగిన హార్దిక్ సేన, ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. సోమవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 99 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం తిలక్ వర్మ (101*) అద్భుత సెంచరీతో కదం తొక్కగా, 4 వికెట్ల హీరో అశ్వని కుమార్, ఇతర బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. కాగా, నేటి మ్యాచ్ లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా.. సాయి సుదర్శన్ ను డకౌట్ చేశాడు. ఈ సీజన్ లో బుమ్రాకు ఇదే తొలి వికెట్. ఈ మ్యాచ్ కు ముందు ఐదు మ్యాచ్ లు ఆడినా, బుమ్రా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

200 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ కనీస పోరాటం కూడా చేయకుండానే చేతులెత్తేసింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే సాయి సుదర్శన్ (0) ఔటవ్వడంతో ఆ జట్టు పతనం మొదలైంది. జోస్ బట్లర్ (5), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (14) కూడా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (26) కాసేపు పోరాడినా, మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. ముఖ్యంగా యువ బౌలర్ అశ్వని కుమార్ 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 4 వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మిచెల్ సాంట్నర్, గజన్ఫర్ చెరో రెండు వికెట్లు తీయగా, బుమ్రా, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు. దీంతో గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో కేవలం 100 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ముంబై శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ గెలుపు రాబోయే మ్యాచ్‌లకు వారికి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (13), డానిష్ మలేవార్ (2) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (15) కూడా నిరాశపరచడంతో 44 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ముంబై కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, నమన్ ధీర్ (45)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 52 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ధీర్ ఔటయ్యాక, తిలక్ వర్మ తన అసలు విశ్వరూపం ప్రదర్శించాడు. గుజరాత్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. కేవలం 45 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15) నెమ్మదిగా ఆడినా, తిలక్ విధ్వంసంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో రబాడా 3 వికెట్లు పడగొట్టాడు.
Go Back to Shorts
Mumbai Indians
Gujarat Titans
Ahmedabad
IPL 2026

More Telugu News