వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy review on Airports
  • వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం విమానాశ్రయాల నిర్మాణంపై సమీక్ష
  • వరంగల్ విమానాశ్రయం కోసం 953 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగించినట్లు వెల్లడి
  • ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచన
వరంగల్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్‌కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఇతర అధికారులతో విమానాశ్రయాల ఏర్పాటుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాల నిర్మాణంపై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనులను త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. వరంగల్ విమానాశ్రయానికి సంబంధించి ఇప్పటికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు.

త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. డిఫెన్స్, సివిల్ ఏవియేషన్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపిన నేప‌థ్యంలో, దీనిపై మ‌రింత లోతైన అధ్య‌య‌నం చేసి సాధ్యాసాధ్యాల‌పై నివేదిక రూపొందించాల‌ని అధికారులను ఆదేశించారు.
Go Back to Shorts
Ponguleti Srinivas Reddy
Telangana Airports

More Telugu News