సింహం బయటకు వస్తుంటే గుంటనక్కల గుండెల్లో దడ పుడుతోంది: కేటీఆర్

  • కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోందని విమర్శ
  • కేసీఆర్ జగిత్యాల వస్తున్నారనగానే రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళుతున్నారని ఆగ్రహం
  • కేసీఆర్ సభ అనేసరికి రోడ్డును తవ్వుతున్నారని విమర్శ
సింహం బయటకు వస్తుందంటే గుంటనక్కల గుండెల్లో దడ పుడుతుందని, అందుకే కేసీఆర్ జగిత్యాలలో బహిరంగ సభకు వస్తున్నారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో కుట్రలకు తెరలేపుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డిని కేటీఆర్, హరీశ్ రావులు కలిశారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ సభ పెడతానంటే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

రేవంత్ రెడ్డి చాలా సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ జగిత్యాల సభకు వస్తున్నారంటే రేవంత్ రెడ్డి మేడిగడ్డకు వెళుతున్నారని అన్నారు. రెండున్నరేళ్లలో మేడిగడ్డ వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయం లేదా అని ప్రశ్నించారు. ఇక్కడ కేసీఆర్ కీలక బహిరంగ సభ జరుగుతుంటే టీవీలల్లో కేసీఆర్‌తో పాటు తన మేడిగడ్డ పర్యటన కూడా చూపించాలని, అలాగే పత్రికల్లో పతాక శీర్షికన కేసీఆర్‌తో పాటు తన వార్త రావాలనే చిల్లర ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు.

అలాగే జగిత్యాల వచ్చే రోడ్డు మూడేళ్లలో గుర్తుకు రాలేదు కానీ, ఇప్పుడు కేసీఆర్ సభ అనేసరికి రోడ్డును తవ్విస్తున్నారని మండిపడ్డారు. కోరుట్ల నుంచి ఎవరూ రాకుండా తవ్విస్తున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నో బహిరంగ సభలు జరిగాయని, ఇప్పుడు కూడా విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హైట్ మాత్రమే చిన్నది కాదని మెదడు కూడా చిన్నదేనని ఎద్దేవా చేశారు. కాగా, ఎల్లుండి జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

KTR
K Taraka Rama Rao
BRS Party
Revanth Reddy
Telangana Politics
Jagtial Meeting
Jeevan Reddy

More Telugu News