హర్మూజ్ మళ్లీ మూసివేత... ఇరాన్ సంచలన నిర్ణయం

Iran Closes Hormuz Strait Again Amidst Tensions
  • హర్మూజ్ జలసంధిపై మళ్లీ కఠిన నియంత్రణ విధించిన ఇరాన్
  • తెరిచిన రెండు రోజులకే ఆ మార్గాన్ని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటన
  • అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగించడమే కారణమని ఆరోపణ
  • తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు
  • ప్రపంచ ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం
అమెరికాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేసింది. హర్మూజ్ పై మళ్లీ కఠిన నియంత్రణ విధిస్తున్నట్లు నేడు ఓ ప్రకటనలో తెలిపింది. తమ ఓడరేవులకు వచ్చే నౌకలపై అమెరికా నేవీ దిగ్బంధనాన్ని కొనసాగించడమే ఈ నిర్ణయానికి కారణమని, ఇచ్చిన మాటను అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపించింది.

"ఇరాన్‌ నౌకలకు స్వేచ్ఛా రవాణాను అమెరికా పునరుద్ధరించే వరకు ఈ పరిస్థితిలో మార్పు ఉండదు. హర్మూజ్ జలసంధి కఠినంగా నియంత్రించబడుతుంది" అని ఇరాన్ సైనిక కమాండ్ తమ అధికారిక టెలివిజన్‌లో స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్-లెబనాన్‌ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత, కేవలం రెండు రోజుల క్రితమే ఇరాన్ ఈ జలసంధిని తెరిచింది. అయితే, ఇరాన్‌తో విస్తృత ఒప్పందం కుదిరే వరకు నేవీ దిగ్బంధనం కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

పర్షియన్ గల్ఫ్ నుంచి ఆయిల్ ఎగుమతులకు హర్మూజ్ జలసంధి ప్రధాన మార్గం. ప్రపంచ ఆయిల్ రవాణాలో దాదాపు 20 శాతం ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇరాన్ తాజా నిర్ణయంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని, ఇది ప్రపంచ ఆయిల్ ధరలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Go Back to Shorts
Iran
Hormuz Strait
Strait of Hormuz
US Navy
Donald Trump
Oil exports
Persian Gulf
Middle East tensions
Iran sanctions

More Telugu News