దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy Says He Will Convince Southern States on Womens Bill
  • 2023 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ఇండియా కూటమి మద్దతిస్తుందని హామీ
  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నది అబద్ధమన్న రేవంత్ రెడ్డి
  • డీలిమిటేషన్ పేరుతో బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని కుట్ర చేసిందని ఆగ్రహం
2023  నాటి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే, దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల లోపు నాటి మహిళా రిజర్వేషన్‌ను అమలు చేస్తే మద్దతిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నది అబద్ధమని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం కాంగ్రెస్ పెద్దలను కలిసి బిల్లు వీగిపోయినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్ సభలో వీగిపోవడంతో దేశానికి పెద్ద ప్రమాదం తప్పిందని వ్యాఖ్యానించారు. బిల్లు వీగిపోవడం రాజకీయ ఓటమి కాదని, బీజేపీ విధానాలకు జరిగిన ఓటమి అని అభివర్ణించారు.

ఎన్డీయే మూడు బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేసిందని ఆరోపించారు. దక్షిణ భారతదేశానికి జరిగే అన్యాయాన్ని అడ్డుకుంటామని అన్నారు. మహిళా రిజర్వేషన్లను చిన్న సవరణలతో అమలు చేయవచ్చని అన్నారు. బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు.

సోమవారం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసి కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లును మాత్రమే పెడితే ఇండియా కూటమి ఏకగ్రీవంగా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత తనదేనని తెలిపారు. మహిళా రిజర్వేషన్లలో కూడా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాలు ఉండాలని కోరారు. డీలిమిటేషన్ పేరుతో ఉత్తరాది, దక్షిణాది మధ్య చిచ్చుపెట్టవద్దని ముఖ్యమంత్రి కోరారు. డీలిమిటేషన్ పేరుతో లోక్ సభ సీట్లను 850కి పెంచి బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలనే కుట్ర చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీకి రాజకీయాల కంటే దేశమే ముఖ్యమని రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందిరాగాంధీ వంటి గొప్ప నేతలు కాంగ్రెస్ పార్టీ తరఫున దేశాన్ని నడిపించారని, బీజేపీ నుంచి ఇప్పటి వరకు మహిళ పార్టీ అధ్యక్షురాలు కాలేదని విమర్శించారు. ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana CM
Women's Reservation Bill
Parliament
South Indian States
Congress

More Telugu News