టికెట్ ధరలను అమాంతం పెంచేసిన ఎస్ఆర్‌హెచ్.. అభిమానుల ఫైర్

  • సీఎస్కేతో మ్యాచ్‌కు టికెట్ల ధరలు రెట్టింపు చేసిన ఎస్‌ఆర్‌హెచ్
  • సన్‌రైజర్స్ యాజమాన్యంపై మండిపడుతున్న అభిమానులు
  • ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ కావడంపై అనుమానాలు
  • టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఫ్యాన్స్ ఆరోపణ
  • విక్రయాల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్
ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో (సీఎస్కే) జరిగే మ్యాచ్‌ను సొమ్ము చేసుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) యాజమాన్యం సిద్ధమైంది. శనివారం జరగనున్న ఈ మ్యాచ్‌కు టికెట్ల ధరలను అమాంతం రెట్టింపు చేయడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమానాన్ని అడ్డం పెట్టుకుని యాజమాన్యం దోపిడీకి పాల్పడుతోందని, సామాన్య అభిమాని మ్యాచ్ చూసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.

సౌత్ ఈస్ట్, వెస్ట్ టెర్రస్ స్టాండ్స్ టికెట్ల ధరను రూ.1,250 నుంచి నేరుగా రూ.2,500కు పెంచేశారు. అలాగే, రూ.2,250గా ఉన్న ఈస్ట్, వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్ టికెట్ ధరను రూ.3,500కు చేర్చారు. ఇక సౌత్ కార్పొరేట్ బాక్స్ టికెట్ ధరను రూ.23,000 నుంచి ఏకంగా రూ.33,000కు పెంచడం గమనార్హం. వీటికి అదనంగా టికెట్ కేటగిరీని బట్టి రూ.300 నుంచి రూ.2,000 వరకు బుకింగ్ ఛార్జీలు వసూలు చేస్తుండటం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది.

ధరలు పెరిగినా, తమ అభిమాన ఆటగాడు ధోనీని చూసేందుకు టికెట్లు కొందామని ఆన్‌లైన్ యాప్ తెరిస్తే, భారీ క్యూ చూపిస్తోందని, క్షణాల్లోనే టికెట్లు అమ్ముడైపోయాయని 'సోల్డ్ అవుట్' బోర్డులు కనిపిస్తున్నాయని అభిమానులు వాపోతున్నారు. కాంప్లిమెంటరీ పాస్‌లు పోగా మిగిలిన టికెట్లను యాజమాన్యం ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేసి, సిఫార్సుల మేరకు అధిక ధరలకు అమ్ముకుంటోందని పలువురు ఆరోపిస్తున్నారు. తమకు చిత్తశుద్ధి ఉంటే, ఎన్ని టికెట్లు విక్రయించారో వాటి వివరాలను బహిరంగంగా వెల్లడించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

IPL 2026
CSK
SRH
Hyderabad
MS Dhoni
Ticket Rates
Cricket Fans
IPL Match
Black Tickets
Sunrisers Hyderabad
Chennai Super Kings
Uppal Stadium

More Telugu News