మహిళా బిల్లును వ్యతిరేకించి ఏం సాధించారు?: జగన్

  • మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును వ్యతిరేకించిన పార్టీలపై జగన్ విమర్శలు
  • ఈ పరిణామంతో మహిళలకు, దక్షిణ రాష్ట్రాలకు న్యాయం జరగలేదని వ్యాఖ్య
  • 2026 జనాభా లెక్కలతో డీలిమిటేషన్‌ చేస్తే దక్షిణాదికి నష్టమని ఆందోళన
  • కుటుంబ నియంత్రణ పాటించినందుకు శిక్ష అనుభవించాల్సి వస్తోందని పోస్ట్
మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును పార్లమెంటులో వ్యతిరేకించిన పార్టీలు తాము ఏం సాధించాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. ఈ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్ల మహిళలకు, దక్షిణ భారత రాష్ట్రాలకు ఏకకాలంలో అన్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, 2026కు మూడింట రెండొంతుల మెజారిటీ లభించని నేపథ్యంలో జగన్ ఎక్స్ వేదికగా స్పందించారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) చేపడితే దక్షిణ రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

"ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు వాళ్లు ఏం సాధించారు? వాస్తవ పరిస్థితి చూస్తే, దక్షిణాది రాష్ట్రాల సంఖ్యాబలం (సీట్లు) తగ్గిపోతుంది, మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వాయిదా పడింది. దీనివల్ల దక్షిణాదికి న్యాయం జరగలేదు, మహిళలకూ న్యాయం అందలేదు.

ఒకవేళ 2026లో జనాభా లెక్కలు తీస్తే, దక్షిణాది పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. కుటుంబ నియంత్రణ విషయంలో ఎంతో క్రమశిక్షణతో వ్యవహరించినందుకు దక్షిణాది రాష్ట్రాలను మరింతగా శిక్షించినట్లు అవుతుంది. జనాభాను నియంత్రించిన పాపానికి మా ప్రాతినిధ్యాన్ని తగ్గించడం ఎంతవరకు సమంజసం? ఇది దక్షిణాదిపై చూపిస్తున్న వివక్ష కాదా? రాజకీయ పార్టీలు ఈ అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉంటున్నాయో అర్థం కావడం లేదు" అని జగన్ ట్వీట్ చేశారు.

Jagan
Jagan Mohan Reddy
YS Jagan
Women Reservation Bill
Parliament
South India
Delimitation
Population Census 2026
YSRCP
Political News

More Telugu News