చెవిరెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాలపై పూర్తి వివరాలు బయటపెడతా: పులివర్తి నాని
- చెవిరెడ్డి కుటుంబ అవినీతికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న పులివర్తి నాని
- వారం రోజుల్లో సినిమా చూపిస్తా అంటూ వార్నింగ్
- చెవిరెడ్డి కొడుకు మోహిత్ రెడ్డివి పిల్ల చేష్టలని ఎద్దేవా
- జగన్‌ను కూడా మోసం చేసిన చరిత్ర ఆ కుటుంబానిదని విమర్శ
తిరుపతి వేదికగా సాగుతున్న రాజకీయ పోరు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబంపై టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని విరుచుకుపడ్డారు. చెవిరెడ్డి కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలపై తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని, వారం రోజుల్లోనే చెవిరెడ్డికి 'సినిమా చూపిస్తా' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తండ్రి పేరు చెప్పుకుని కోట్లు సంపాదిస్తూ, గర్వంతో ఊగిపోతున్నారంటూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై మండిపడ్డారు.
మోహిత్ రెడ్డి చేసేవి చిన్నపిల్లల చేష్టలని, తమ నాయకుడు నారా లోకేశ్ పేరు ఎత్తితే ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన తెగేసి చెప్పారు. లోకేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని, ఆయన పనితీరును విమర్శించే స్థాయి మోహిత్ రెడ్డికి లేదని నాని ధ్వజమెత్తారు. వెన్నుపోటు రాజకీయాలకు చెవిరెడ్డి కుటుంబమే బ్రాండ్ అంబాసిడర్ అని పులివర్తి నాని ఎద్దేవా చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి వంటి నేతలనే కాకుండా, చివరకు జగన్‌ను కూడా మోసం చేసిన చరిత్ర ఆ కుటుంబానిదని విమర్శించారు.
మద్యం డబ్బులు లెక్కిస్తున్న వీడియోల్లో కనిపిస్తున్న కోట్లాది రూపాయల నగదు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తుడా వ్యవహారంలో జరిగిన భారీ అవినీతిపై విచారణ వేగంగా సాగుతోందని, అవినీతికి సహకరించిన ఏ అధికారిని వదిలిపెట్టేది లేదని, వారం రోజుల్లోనే సస్పెన్షన్లు మొదలవుతాయని హెచ్చరించారు.
టీడీపీ కార్యకర్తలను భయపెట్టడం ఎవరి వల్ల కాదని అన్నారు. కక్షపూరిత రాజకీయాలకు తాను దూరంగా ఉన్నానని, కానీ తమపై అభాండాలు వేస్తే సహించబోనని స్పష్టం చేశారు.