సీఎంపై అనుచిత పోస్టు కేసు... వైసీపీ నేత పూడి శ్రీహరికి బెయిల్

Pudi Srihari Granted Bail in CM Defamation Case
  • ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్ట్ కేసు 
  • పూడి శ్రీహరికి కుప్పం కోర్టులో ఊరట
  • ఆ పోస్ట్‌ను తాను పెట్టలేదని, ఫార్వార్డ్ కూడా చేయలేదని శ్రీహరి స్పష్టీకరణ
  • శ్రీహరిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారన్న వైసీపీ నేతలు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్ట్ పెట్టారన్న ఆరోపణలతో అరెస్టయిన వైసీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరికి ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు కుప్పం కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. బుధవారం ఉదయం విజయవాడలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, అనంతరం కుప్పంకు తరలించిన విషయం తెలిసిందే.

బెయిల్ లభించిన అనంతరం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. వివాదాస్పదమైన కంటెంట్‌ను తాను సృష్టించలేదని, పోస్ట్ చేయలేదని, ఫార్వార్డ్ కూడా చేయలేదని స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా సీనియర్ జర్నలిస్టుగా చట్టానికి లోబడే పనిచేశానని, తనపై గతంలో ఎలాంటి కేసులు లేవని తెలిపారు. పోలీసులు అడిగిన సమాచారం మొత్తం ఇచ్చానని, భవిష్యత్తులోనూ విచారణకు పూర్తిగా సహకరిస్తానని వివరించారు.

ఈ అరెస్టుపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. శ్రీహరిని పోలీసులు అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధించారని పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపించారు. పార్టీ అందించిన న్యాయ సహాయంతోనే బెయిల్ సాధ్యమైందని తెలిపారు. ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్ మాట్లాడుతూ, ఈ అరెస్టు కేవలం వేధించేందుకేనని, చట్టపరంగా ఈ కేసు నిలబడదని అన్నారు. ఇలాంటి చర్యలకు వైసీపీ శ్రేణులు భయపడవని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో కత్తి ఉన్నట్లుగా చిత్రీకరించిన కార్టూన్‌ను పోస్ట్ చేశారనే ఆరోపణలపై చిత్తూరులో శ్రీహరిపై కేసు నమోదైంది. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీహరి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేశారు. అరెస్టు సమయంలో పోలీసులు ఆయన మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Go Back to Shorts
Pudi Srihari
Chandrababu Naidu
YSRCP
Andhra Pradesh Politics
Social Media Post
Defamation
Kuppam Court
Ponnavolu Sudhakar Reddy
KRJ Bharat
Arrest

More Telugu News