ఒక మంత్రికి '10 పర్సెంట్ మంత్రి' అనే పేరుంది: మోత్కుపల్లి
- అవినీతి మంత్రిపై రేవంత్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న మోత్కుపల్లి
- సీఎం ఒక్కడే కష్టపడితే సరిపోదని వ్యాఖ్య
- రేవంత్ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉందన్న మోత్కుపల్లి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు, ఆయన మంత్రివర్గంపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వ్యవస్థలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని, అవమానాన్ని చక్కదిద్దే స్థితిలో ముఖ్యమంత్రి లేరని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో ఒక మంత్రికి '10 పర్సెంట్ మంత్రి' అనే పేరు ముద్ర పడిపోయిందని, ఏ మూలకెళ్లి అడిగినా జనం ఆయన పేరే చెబుతున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఇంత బహిరంగంగా అవినీతి జరుగుతున్నా, సదరు మంత్రిపై చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎస్సీ, బీసీ, ఓసీ ఎవరైనా సరే అవినీతిపరుడిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి ఒక్కడే కష్టపడితే సరిపోదని అన్నారు. సీఎం వెనుక ఉండి గోతులు తవ్వే 'నల్లికుట్లోళ్లు' ఎవరో రేవంత్‌కు తెలియదా? అని నిలదీశారు. ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉందని, సొంత పార్టీలోనే కుట్రలు జరుగుతున్నా సీఎం మౌనంగా ఉండటం వెనుక అర్థమేంటని ప్రశ్నించారు.
ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత కూడా, ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు సమావేశాలు పెడుతున్నా ఏమీ చేయలేకపోతున్నారని విమర్శించారు. కేవలం ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, ప్రజలు వెంట ఉండాలంటే ముందు అవినీతికి అంతం పలకాలని హితవు పలికారు.