లాహోర్‌లో లష్కరే తోయిబా కీలక నేత అమీర్ హమ్జాపై కాల్పులు

  • లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జా
  • హఫీజ్ సయీద్ కు అత్యంత సన్నిహితుడు
  • హమ్జాపై ఇప్పటికే నిషేధం విధించిన భారత్, బ్రిటన్ తదితరులు

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. లాహోర్ నగరంలో జరిగిన ఈ దాడిలో హమ్జా తీవ్రంగా గాయపడగా, ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. గతంలో జరిగిన ఒక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన, ఇప్పుడు జరిగిన ఈ కాల్పులతో మృత్యువుతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది.


లష్కరే తోయిబా అధినేత హాఫిజ్ సయీద్ తర్వాత ఆ సంస్థలో అత్యంత కీలకమైన వ్యక్తి అమీర్ హమ్జా. సంస్థ ఆవిర్భావం నుంచి హాఫిజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడిగా, సలహాదారుడిగా ఆయన వ్యవహరించారు. అమీర్ హమ్జాను అమెరికా ట్రెజరీ విభాగం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్యసమితి ఇప్పటికే ఇతనిపై నిషేధం విధించాయి.


ఐఎస్ఐ అండదండలతో పనిచేస్తున్న లష్కరే తోయిబా... భారత్‌లో అనేక విధ్వంసకర దాడులకు పాల్పడింది. సరిహద్దుల గుండా ఉగ్రవాదులను చొరబెట్టడం, నిధుల సేకరణ వంటి కార్యక్రమాల్లో హమ్జా కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిఘా వర్గాల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో భారత్ వ్యతిరేక ఉగ్రవాద నాయకులు వరుసగా దాడులకు గురవుతుండటం గమనార్హం. అమీర్ హమ్జాపై జరిగిన ఈ దాడితో పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లో మరోసారి కలకలం రేగింది. ఈ ఘటన వెనుక ఉన్న నిందితుల కోసం పాకిస్థాన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.


Amir Hamza
Lashkar-e-Taiba
LeT
Hafiz Saeed
Lahore
Pakistan Terrorist
Terrorist Attack
India
ISI
Terrorism

More Telugu News