క్రీడా దిగ్గజాలతో నారా లోకేశ్ ముఖాముఖి... సూచనలు, సలహాలు స్వీకరణ

  • ఏపీలో క్రీడాభివృద్ధికి పలు సూచనలు, సలహాలు
  • పాఠశాల స్థాయి నుంచే శిక్షణ ఇవ్వాలన్న పీవీ సింధు
  • వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించాలని మిథాలీ రాజ్ సూచన
  • క్రీడాకారులకు ప్రత్యేక కరిక్యులమ్ పరిశీలించాలన్న మల్లేశ్వరి+
ఆంధ్రప్రదేశ్‌లో క్రీడారంగానికి పూర్వవైభవం తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తిరుపతిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులతో ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై వారి నుంచి విలువైన సూచనలు, సలహాలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తోందని, మంత్రి లోకేష్ అండగా నిలుస్తున్నారని క్రీడాకారులు ప్రశంసించారు.

ఈ సందర్భంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ, పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు ఇష్టమైన క్రీడలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ వేసవి శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని, ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సహించాలని కోరారు. అర్జున అవార్డు గ్రహీత కరణం మల్లేశ్వరి మాట్లాడుతూ, ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ తరహాలో ఏపీలోనూ క్రీడాకారుల కోసం ప్రత్యేక కరిక్యులమ్ రూపొందించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో తనకు మంత్రి లోకేష్ అండగా నిలిచారని ప్రముఖ అథ్లెట్ యర్రాజీ జ్యోతి గుర్తుచేసుకున్నారు. అథ్లెటిక్స్‌తో పాటు ఇతర క్రీడలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని కోరారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద 421 మందికి ఉద్యోగాలు కల్పించడం పట్ల ఖోఖో క్రీడాకారుడు శివారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని హాకీ క్రీడాకారులను ప్రోత్సహించాలని హాకీ క్రీడాకారిణి రజని కోరారు. 2028 ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న తనకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మ అభ్యర్థించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్రీడారంగం మళ్లీ అభివృద్ధి పథంలో పయనిస్తుందని పలువురు క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కిడాంబి శ్రీకాంత్, ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి, లలిత్ బాబు, షేక్ అర్షద్‌తో పాటు పలువురు క్రీడాకారులు, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పాల్గొన్నారు.

Nara Lokesh
Andhra Pradesh sports
PV Sindhu
Mithali Raj
Karanam Malleswari
Yarraji Jyothi
AP sports development
sports quota jobs
Kidambi Srikanth
sports infrastructure

More Telugu News