చంద్రగిరి చెవిలో పువ్వును జగనే నమ్మడం లేదు: మంత్రి నారా లోకేశ్

  • చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఆయన అధినేత జగనే నమ్మడం లేదన్న లోకేష్
  • టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ
  • తప్పుడు కేసులు పెట్టి వేధించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ
  • చంద్రగిరికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత తనదేనని భరోసా
  • పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలను గుర్తించి ఉన్నత స్థానం కల్పిస్తామని వెల్లడి
చంద్రగిరిలో చెవిలో పువ్వు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వారి అధినేత వైఎస్ జగనే నమ్మడం లేదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి చేతివాటం జగన్‌కు అర్థం కావడంతోనే ఆయన్ను పక్కనపెట్టారని ఆరోపించారు. మద్యంలో రూ.600 కోట్లు కొట్టేశాడని, దేవుడి లడ్డూలు, వస్త్రాలను సైతం అమ్ముకున్న అవినీతిపరుడి నుంచి చంద్రగిరి ప్రజలకు విముక్తి లభించిందని లోకేశ్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని నియోజకవర్గంలో పనుల కోసం తమ వెంట పడుతుంటారని, గత 22 నెలల్లో నియోజకవర్గంలో రూ.900 కోట్లతో పనులకు శ్రీకారం చుట్టారని లోకేశ్ అభినందించారు.

ఇవాళ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడైన అనంతరం తొలిసారిగా చంద్రగిరి వచ్చిన లోకేశ్ కు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం కల్పించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని, పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వంలో ప్రజలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, ఇబ్బంది పెట్టిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని లోకేశ్ స్పష్టం చేశారు. తాము వారిలా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయబోమని, చట్టపరిధిలోనే దోషులకు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఇటీవల దేవాలయానికి వెళ్లిన భక్తులపై చెవిరెడ్డి మనుషులు చేసిన దాడిని ప్రస్తావిస్తూ, అటువంటి దుశ్చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు.

తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని, వారి త్యాగాల వల్లే తాము అధికారంలోకి వచ్చామని లోకేశ్ గుర్తుచేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను 'మై టీడీపీ' యాప్ ద్వారా గుర్తించి, సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇటీవల ఒక క్లస్టర్ ఇన్‌చార్జికి, మండల అధ్యక్షుడికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించడమే ఇందుకు నిదర్శనమని వివరించారు.

చంద్రగిరితో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని, చంద్రబాబు రాజకీయ జీవితం ఇక్కడి నుంచే ప్రారంభమైందని లోకేశ్ తెలిపారు. తన యువగళం పాదయాత్రకు కూడా ఇది టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు. చంద్రగిరికి పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత తనదని, చిన్నచిన్న సమస్యలను పక్కనపెట్టి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని, 150 రోజుల్లో డీఎస్సీ పూర్తి చేశామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.


Nara Lokesh
Chandragiri
Chevi Reddy Bhaskar Reddy
TDP
YS Jagan
Andhra Pradesh Politics
Pulivarthi Nani
Telugu Desam Party
My TDP App
AP DSC

More Telugu News