ఇరాన్‌కు ఇక ఆయుధాలు పంపబోమని చైనా చెప్పింది: ట్రంప్

Donald Trump Says China Will Not Send Weapons to Iran
  • తమ మాట విని చైనా వెనక్కి తగ్గిందన్న ట్రంప్
  • హర్మూజ్ ను ఇక మూసి ఉంచడం జరగదని ఉద్ఘాటన 
  • హర్మూజ్ ను తెరిచే ప్రయత్నాలపై చైనా సంతోషంగా ఉందని వెల్లడి
  • చర్చలు యుద్ధం కన్నా మంచివని వ్యాఖ్యలు
ఇకపై ఇరాన్‌కు ఎలాంటి ఆయుధాలు పంపబోమని చైనా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరిచి ఉంచేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు చైనా మద్దతు తెలిపిందని ఆయన పేర్కొన్నారు.

ఈ విషయంపై తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. "ఇకపై హర్మూజ్ ను మూసి ఉంచడం జరగదు. హర్మూజ్ జలసంధిని నేను శాశ్వతంగా తెరుస్తుండటం చైనాకు చాలా సంతోషాన్నిచ్చింది. అమెరికాతో పాటు ప్రపంచం కోసం నేను ఈ పని చేస్తున్నాను. వారు ఇరాన్‌కు ఆయుధాలు పంపబోమని అంగీకరించారు" అని ఆయన రాసుకొచ్చారు.

ప్రపంచ ఇంధన సరఫరాలో హార్ముజ్ జలసంధి చాలా కీలకమైనది. ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. మరోవైపు, చైనా ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తోందంటూ గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో తనకున్న సంబంధాల గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. "నేను చైనా వెళితే అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నన్ను గట్టిగా ఆలింగనం చేసుకుంటారు. మేమిద్దరం కలిసి తెలివిగా పనిచేస్తున్నాం. ఇది యుద్ధం కన్నా మంచిది కదా?" అని వ్యాఖ్యానించారు. అయితే, అవసరమైతే యుద్ధానికి కూడా అమెరికా సిద్ధమేనని హెచ్చరించారు.

కాగా, అమెరికాతో ఇరాన్ చర్చలకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం నెరుపుతున్నప్పటికీ, ఇరాన్ ను చర్చల వరకు తీసుకురావడం వెనుక చైనా హస్తం ఉందని ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. తెరవెనుక చైనా మంత్రాంగం నడుపుతోందని భావిస్తున్నారు. ఈ క్రమంలో, ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 
Go Back to Shorts
Donald Trump
Iran
China
Hormuz Strait
Xi Jinping
US China relations
Iran nuclear deal
Middle East tensions
weapon supply
Truth Social

More Telugu News