దేవుడు అన్నీ చూస్తున్నాడు.. మత్స్యకారుల హక్కుల్ని చంద్రబాబు తాత కూడా తీసుకోలేరు: జగన్

  • కళ్లు మూసి తెరిచేలోగా మళ్లీ మన ప్రభుత్వమన్న జగన్
  • కూటమి పాలనలో మత్స్యకారుల పొట్ట కొడుతున్నారని విమర్శ
  • జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేసే కుట్ర జరుగుతోందని ఆరోపణ
  • తమ హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టులు, హార్బర్లు నిర్మించామని వెల్లడి
  • అధికారంలోకి రాగానే మత్స్యకారుల హక్కులు కాపాడతామని హామీ
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన అన్యాయంగా సాగుతోందని, దేవుడు అన్నీ చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. కళ్లు మూసుకుని తెరిచేలోపు మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశామని జగన్ గుర్తుచేశారు. రాష్ట్రంలో రూ.26 వేల కోట్లతో నాలుగు కొత్త పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు 35 శాతం పూర్తి చేశామని, రామాయపట్నం పోర్టు పనులు దాదాపు పూర్తయ్యాయని వివరించారు.

2024 మార్చి 12న తాము జువ్వలదిన్నె హార్బర్‌ను వర్చువల్‌గా ప్రారంభించామని, కానీ నేటికీ దానిని మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదని కూటమి ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు మేలు చేయకపోగా, వారి పొట్ట కొడుతోందని విమర్శించారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

మార్చి 12న నారా లోకేశ్ జువ్వలదిన్నెను సందర్శించగా, 16న ఇక్కడ సీజ్ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారని జగన్ ఆరోపించారు. అధికారంలో ఉన్న పెద్దలే ఈ దొంగతనం చేశారని, అందుకే ఒక్కరినీ అరెస్టు చేయలేదని అన్నారు. బోట్లు ఎత్తుకెళ్లేవారికి ముఖ్యమంత్రి కొడుకు ఆశీస్సులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూడేళ్లు కళ్లు మూసి తెరిచేలోగా గడిచిపోతాయని, ఆ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని జగన్ ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తామని హామీ ఇచ్చారు. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు అని, వాటిని చంద్రబాబు తాత కూడా వారి నుంచి తీసుకోలేరని జగన్ స్పష్టం చేశారు.

YS Jagan
YS Jagan Mohan Reddy
Chandrababu Naidu
Andhra Pradesh
fishermen
fishing harbor
Juvaladienne
ports
YSRCP
AP Politics
Nara Lokesh

More Telugu News