ఇరాన్‌తో చర్చలకు అమెరికా కొత్త మెలిక.. రెండు కఠిన షరతులు!

Americas New Twist Conditions for Iran Talks
  • ఇరాన్‌తో చర్చల పునఃప్రారంభానికి రెండు కొత్త షరతులు విధించిన అమెరికా 
  • హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, లేదంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరిక
  • ఒప్పందాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆమోదం తప్పనిసరి అని స్పష్టీకరణ
  • ఇరాన్ ప్రభుత్వంలో రాజకీయ, సైనిక నాయకత్వాల మధ్య విభేదాలున్నాయని కథనం
అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా-ఇరాన్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌తో చర్చలు పునఃప్రారంభించాలంటే రెండు కఠినమైన షరతులను పాటించాల్సిందేనని అమెరికా స్పష్టం చేసింది. పాకిస్థాన్‌లో జరగబోయే తదుపరి విడత చర్చలకు ముందే ఈ నిబంధనలను తెరపైకి తెచ్చింది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు రెండు రోజుల్లో పునఃప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచనప్రాయంగా తెలిపినప్పటికీ, ఈ కొత్త షరతులు సందిగ్ధతకు దారితీస్తున్నాయి.

దౌత్యపరమైన వర్గాలను ఉటంకిస్తూ ఇజ్రాయెల్ హయోమ్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికా పెట్టిన మొదటి షరతు.. హర్మూజ్ జలసంధిని ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిగా తెరవడం. ఇరాన్ గనుక తమ నౌకలు, ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకుంటే, తాము కూడా ఇరాన్ నౌకలను కదలనివ్వబోమని అమెరికా స్ప‌ష్టం చేసింది. ప్రతిచర్య తప్పదనే సంకేతాలను బలంగా పంపింది.

ఇక రెండో షరతుగా.. చర్చలకు వచ్చే ఇరాన్ ప్రతినిధి బృందానికి ఒప్పందాలను ఖరారు చేసే పూర్తి అధికారం ఉండాలని అమెరికా పట్టుబడుతోంది. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) సహా ప్రభుత్వంలోని అన్ని కీలక విభాగాల ఆమోదం పొందే అధికారం ఆ బృందానికి ఉండాలని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్‌లో కుదిరే ఏ ఒప్పందానికైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులందరి సమ్మతి ఉండాలని కోరుకుంటోంది.

ఇరాన్ ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు
అమెరికా ఈ షరతులు పెట్టడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వంటి రాజకీయ నాయకత్వానికి, ఐఆర్‌జీసీకి మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరినట్లు కథనాలు వస్తున్నాయి. ఇటీవ‌ల‌ పాకిస్థాన్‌లో జరిగిన చర్చల్లో అమెరికాకు సమాధానాలు ఇవ్వకుండా రాజకీయ ప్రతినిధి బృందాన్ని ఐఆర్‌జీసీకి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు అడ్డుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో దేశాన్ని పూర్తి ఆర్థిక పతనం నుంచి కాపాడాలని అధ్యక్షుడు పెజెష్కియాన్ పార్లమెంట్ స్పీకర్‌ను కోరినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంతర్గత గందరగోళం కారణంగానే ఒప్పందం చేసుకునే పూర్తి అధికారంతో వస్తేనే చర్చలుంటాయని అమెరికా స్ప‌ష్టం చేసింది.

గత వారాంతంలో పాకిస్థాన్‌లో ఇరు దేశాల మధ్య జరిగిన తొలి విడత చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగిశాయి. దశాబ్దం తర్వాత అమెరికా, ఇరాన్ అధికారులు నేరుగా చర్చలు జరపడం ఇదే తొలిసారి. ఇప్పుడు పాకిస్థాన్ చొరవతో ఈ వారంలోనే రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే, అమెరికా అధికారులు దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు.
Go Back to Shorts
Iran-US
Iran Nuclear Deal
Iran
America
US Iran Relations
Trump
Masoud Pezeshkian
Abbas Araghchi
IRGC
Pakistan
Hormuz Strait

More Telugu News