రేవంత్ రెడ్డి 'బంట్రోతు' వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్

  • తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం
  • ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెంచుతామన్నా రాద్దాంతం ఏమిటని ప్రశ్న
  • వెంకయ్యనాయుడు, సీపీ రాధాకృష్ణన్ దక్షిణాదివారు కాదా అని ప్రశ్న
నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, పునర్విభజన జరిగితే ఇప్పుడు వచ్చిన కేంద్రమంత్రి పదవులు కూడా రాబోవని, బంట్రోతులుగా మారుతారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు.

తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. అంజయ్య, ఇతర ముఖ్యమంత్రులను కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో అందరికీ తెలుసని అన్నారు. జనాభా ప్రాతిపదికన పెంచితే దక్షిణాదికి నష్టమని ఇన్నాళ్లు అన్నారని, ప్రతి రాష్ట్రంలో కనీసం 50 శాతం సీట్లు పెంచుతుంటే కూడా రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాదికి బీజేపీ కీలక పదవులు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు.

ఉపరాష్ట్రపతి పదవులు చేపట్టిన వెంకయ్యనాయుడు, సీపీ రాధాకృష్ణన్ దక్షిణాదివాళ్లు కాదా అని ప్రశ్నించారు. ఎంపీ లక్ష్మణ్ ఉత్తరాదికి వలసపోతారని విమర్శించడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ వదిలిపెట్టి కేరళకు రాలేదా అని నిలదీశారు. దక్షిణాది ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళితే రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి పంపించే డబ్బుతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని విమర్శించారు.

జనాభా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది నష్టపోతుందనే ఆలోచనతో మోదీ రాష్ట్రాలకు కనీసం 50 శాతం సీట్లు పెంపు ప్రతిపాదన తీసుకువచ్చారని తెలిపారు. కానీ గతంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఈసారి జనగణనతో పాటు కులగణన చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సమయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy
Revanth Reddy
Telangana
Parliament Reorganisation
South India
BJP
Congress Party

More Telugu News