సన్‌రైజర్స్ కొత్త బౌలర్ల వికెట్ల జాతర... రాజస్థాన్ పై అద్భుత విజయం

Ishan Kishan Leads Sunrisers to Victory Over Rajasthan
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి, రాజస్థాన్ రాయల్స్‌పై 57 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ మెరుపులు, ఆ తర్వాత బౌలింగ్‌లో కొత్త ముఖాలు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ మాయాజాలంతో సన్‌రైజర్స్ అద్భుత ప్రదర్శన చేసింది.

సన్‌రైజర్స్ నిర్దేశించిన 217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన ప్రఫుల్ హింగే... రెండో బంతికి వైభవ్ సూర్యవంశీ (0), నాలుగో బంతికి ధ్రువ్ జురెల్ (0), ఆరో బంతికి ప్రిటోరియస్‌ను (0) పెవిలియన్‌కు పంపాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి రాజస్థాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. 

ఆ వెంటనే రెండో ఓవర్లో యశస్వి జైస్వాల్ (1)ను సాకిబ్ హుస్సేన్ ఔట్ చేయగా, తన తర్వాతి ఓవర్లో కెప్టెన్ రియాన్ పరాగ్ (4)ను కూడా హింగే పెవిలియన్ చేర్చాడు. దీంతో రాజస్థాన్ కేవలం 9 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ దశలో డోనోవాన్ ఫెరీరా (44 బంతుల్లో 69; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా (32 బంతుల్లో 45; 5 ఫోర్లు) అద్భుతంగా పోరాడారు. ఆరో వికెట్‌కు 118 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. వీరిద్దరి పోరాటంతో రాజస్థాన్ గెలుపుపై కొద్దిసేపు ఆశలు రేకెత్తాయి. 

అయితే, ఈ జోడీని సాకిబ్ హుస్సేన్ విడదీయడంతో రాజస్థాన్ పతనం మళ్లీ మొదలైంది. చివర్లో తుషార్ దేశ్‌పాండే (11 బంతుల్లో 25; 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించినా, అప్పటికే ఆలస్యమైంది. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చెరో 4 వికెట్లతో రాజస్థాన్ పతనాన్ని శాసించారు. ఎషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టాడు. చివరకు రాజస్థాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది.

అంతకుముందు, టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్లోనే అభిషేక్ శర్మ (0) డకౌట్‌గా వెనుదిరిగినా, కెప్టెన్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 91; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు. రాజస్థాన్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించాడు. శతకానికి చేరువలో అతను ఔటయ్యాడు. 

ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ (26 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్సర్లు), నితీశ్ కుమార్ రెడ్డి (13 బంతుల్లో 28; 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ముఖ్యంగా నితీశ్ తన చిన్న ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో సలీల్ అరోరా (13 బంతుల్లో 24) కూడా రాణించడంతో సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 2 వికెట్లు తీశాడు.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 18న చెన్నై సూపర్ కింగ్స్ తో సొంతగడ్డపై ఆడనుంది. 
Go Back to Shorts
Ishan Kishan
Sunrisers Hyderabad
Rajasthan Royals
IPL
Praful Hinge
Sakib Hussain
T20
Cricket
Rajiv Gandhi International Stadium
Donovan Ferreira

More Telugu News