ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజు: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం జిల్లా ప్రజల 75 ఏళ్ల చిరకాల స్వప్నం నెరవేరింది. జిల్లా చరిత్రలో తొలిసారిగా తిరుపతికి నేరుగా వెళ్లే రెగ్యులర్ రైలు సేవలు సోమవారం ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం రోడ్ - తిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను (17439/40) కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాకు ఒక చారిత్రాత్మకమైన రోజని ఆయన అభివర్ణించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రక్షేత్రంతో ఈ రైలు అనుసంధానం చేస్తుందని తెలిపారు. దీనివల్ల వేలాది మంది భక్తులకు ప్రయాణం మరింత సులభతరం అవుతుందన్నారు. ప్రయాణికులతో మాట్లాడినప్పుడు వారిలో కనిపించిన ఆనందం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ రైలు సేవ కేవలం ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని వివరించారు.

ఈ కొత్త రైలు సేవను సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని ఎన్‌డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని అన్నారు. ఇది కేవలం ఒక రైలు మాత్రమే కాదని, శ్రీకాకుళం ప్రజల ఆశలు, ఆకాంక్షలను అభివృద్ధికి అనుసంధానించే కీలక ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వాల్తేర్ డీఆర్ఎం లలిత్ బోహ్రా, ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Ram Mohan Naidu
Srikakulam
Tirupati
Humsafar Express
Train Service
Andhra Pradesh
Railway
Ashwini Vaishnaw
Chandrababu Naidu
Pawan Kalyan

More Telugu News