ముస్లింలపై ఎవరికి ప్రేమ ఉందో చరిత్రే చెబుతుంది: వైసీపీపై ఎంఏ షరీఫ్ ఫైర్

ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ నియామకాలపై సాక్షి దినపత్రిక, వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఏ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, కోడిగుడ్డుపై ఈకలు పీకే విధంగా వ్యవహరిస్తూ ముస్లిం సోదరులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.

ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం హజ్ యాత్రికుల సౌకర్యార్థం, యాత్రపై పవిత్ర భావన కలిగి, అనుభవం ఉన్నవారితోనే కమిటీని ఏర్పాటు చేసిందని షరీఫ్ తెలిపారు. గతంలో జారీ చేసిన జీవో 38లో కొన్ని సాంకేతిక లోపాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఆ లోపాలను సరిదిద్దుతూ కొత్త జీవో ఇచ్చామని వివరించారు. 

స్థానిక సంస్థల కోటా నుంచి ఎన్నికైన ముగ్గురు సభ్యుల పదవీ కాలం ముగిసిందన్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ, ఇద్దరి పదవీ కాలం ముగియగా, మరొకరికి సెప్టెంబర్ వరకు సమయం ఉందన్నారు. ఇది పూర్తిగా నిబంధనల ప్రకారం అధికారులు చేపట్టే సాంకేతిక ప్రక్రియ అని, దీనిపై రాద్ధాంతం చేయడం హాస్యాస్పదమని అన్నారు.

గత వైసీపీ ప్రభుత్వంపై షరీఫ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. "ముస్లింలపై ఎవరికి ప్రేమ ఉందో చరిత్రే చెబుతుంది. చంద్రబాబు కడపలో రూ.25 కోట్లతో హజ్ హౌస్ నిర్మిస్తే, వైసీపీ ప్రభుత్వం దానిని కోవిడ్ సెంటర్‌గా మార్చి నిర్వీర్యం చేసింది. కనీసం తలుపులు, కిటికీలు, ఫ్యాన్లు కూడా దోచుకుపోతుంటే పట్టించుకోలేదు. అలాంటి మీరు ఈరోజు హజ్ పవిత్రత గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది" అని ఎద్దేవా చేశారు.

టీడీపీ ప్రభుత్వం హయాంలో హజ్ కమిటీ ఖాతాలో పొదుపు చేసిన రూ. 23.40 కోట్ల నిధులను వైసీపీ ప్రభుత్వం వాడుకుందే తప్ప, కొత్తగా ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. విజయవాడలో రూ. 80 కోట్లతో తాము తలపెట్టిన హజ్ హౌస్ నిర్మాణాన్ని వైసీపీ గాలికి వదిలేసిందని విమర్శించారు. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పనులను మధ్యలోనే ఆపి ముస్లిం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన దుల్హన్, విదేశీ విద్య వంటి పథకాలను రద్దు చేసి మైనారిటీల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. 

హజ్ కమిటీలో ఏవైనా సమస్యలు ఉంటే ముఖ్యమంత్రిని గానీ, అధికారులను గానీ కలిసి పరిష్కరించుకోవచ్చని, అంతేగానీ అసత్య ప్రచారాలతో సమాజంలో అలజడి సృష్టించవద్దని వైసీపీకి హితవు పలికారు.



MA Shareef
Andhra Pradesh
Haj Committee
YSRCP
TDP
Muslim welfare
Haj House
Chandrababu Naidu
Minority affairs
Muslims

More Telugu News