ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: తెలంగాణకు చెందిన మోస్ట్ వాంటెడ్ మావో నేత ‘రూపి’ హతం

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రభావిత కాంకేర్ జిల్లాలో భద్రతా దళాలు జరిపిన భారీ సెర్చ్ ఆపరేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. చోటే బెటియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. 


ఈ ఘటనలో పార్థాపూర్ ఏరియా కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావో నేత ‘రూపి’ అలియాస్ రంగబోయిన భాగ్య అక్కడికక్కడే మృతి చెందారు. ప్రభుత్వం ఆమెపై గతంలోనే రూ. 25 లక్షల రివార్డు ప్రకటించింది. హతమైన రూపి, 2025లో ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టు అగ్రనేత విజయ్ రెడ్డి భార్య కావడం గమనార్హం.


ఈ ఎన్‌కౌంటర్ అనంతరం ఘటనా స్థలం నుండి ఒక ఆటోమెటిక్ తుపాకీతో పాటు విప్లవ సాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు కాంకేర్ ఎస్పీ నిఖిల్ రాఖేచా వెల్లడించారు. కాల్పుల సమయంలో మరో 10 మంది మావోయిస్టులు తప్పించుకోగా, వారి కోసం మాచ్‌పల్లి అడవుల్లో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు. 


తాజా ఘటనపై బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ స్పందిస్తూ, అడవుల్లో ఉన్న మావోయిస్టులకు సమయం చాలా తక్కువగా ఉందని, ఇప్పటికైనా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని హెచ్చరించారు. హింసా మార్గాన్ని వీడి గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు.


హతమైన రూపి స్వస్థలం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామం. ఆమె వయసు 46 సంవత్పరాలు. 2004లో మావోయిస్టు పార్టీలో చేరిన ఆమె తొలుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పని చేశారు. ఆ తర్వాత అబూజ్‌మడ్ వంటి కఠినమైన ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. 


ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన క్రియాశీల మావోయిస్టుల జాబితాలో కూడా ఆమె పేరు ఉంది. గతంలో లొంగిపోవాలని పోలీసులు పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆమె సాయుధ పోరాటాన్నే కొనసాగించారు. కీలకమైన ఏరియా కమాండర్ మరణించడంతో మావోయిస్టు నెట్‌వర్క్‌కు తీరని లోటు అని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అదనపు బలగాలతో వేట కొనసాగుతోంది.


Rupi
Maoist Rupi
Chhattisgarh Encounter
Kanker District
Naxalites
Telangana Maoist
Vijay Reddy
Counter Insurgency
Security Forces
Dharmaram Village

More Telugu News