తుర్కియే నుంచి బిలియన్ డాలర్లు.. అందమైన అమ్మాయి భార్య‌గా కావాలి: ఉగాండా ఆర్మీ చీఫ్ వింత డిమాండ్

Muhoozi Kainerugaba Demands Billion Dollars and Beautiful Wife from Turkey
ఉగాండా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, దేశాధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడైన ముహూజీ కైనెరుగబా, తుర్కియే ముందు కొన్ని సంచలన, విచిత్రమైన డిమాండ్లను ఉంచారు. తుర్కియే తమకు 1 బిలియన్ డాలర్లు చెల్లించాలని, అదనంగా ఆ దేశంలో అత్యంత అందమైన అమ్మాయిని తనకిచ్చి వివాహం చేయాలని ఆయన కోరడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ డిమాండ్లను 30 రోజుల్లోగా నెరవేర్చకపోతే ఉగాండాలోని తుర్కియే రాయబార కార్యాలయాన్ని మూసివేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

సోమాలియాలో మౌలిక సదుపాయాలు, వ్యాపార ప్రాజెక్టుల ద్వారా టర్కీ భారీగా లాభాలు ఆర్జిస్తోందని, కానీ ఆ ప్రాంతంలో భద్రతా భారాన్ని మాత్రం ఉగాండా మోస్తోందని కైనెరుగబా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆరోపించారు. గత రెండు దశాబ్దాలుగా ఆఫ్రికన్ యూనియన్ మిషన్లలో భాగంగా ఉగాండా దళాలు సోమాలియాలో అల్-ఖైదాతో సంబంధమున్న అల్-షబాబ్ ఉగ్రవాద సంస్థపై పోరాడుతున్నాయని గుర్తుచేశారు. ఈ భద్రతా సేవలకు ప్రతిఫలంగా తుర్కియే తమకు 'సెక్యూరిటీ డివిడెండ్' కింద 1 బిలియన్ డాలర్లు చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

"తుర్కియేకి ఇది చాలా సులభమైన ఒప్పందం. వారు మాకు డబ్బు చెల్లించాలి, లేదంటే నేను ఇక్కడ వారి రాయబార కార్యాలయాన్ని మూసివేస్తాను. బదులుగా వారు కూడా తుర్కియేలోని మా ఎంబసీని మూసివేయవచ్చు. మాకు ఎలాంటి సమస్య లేదు" అని కైనెరుగబా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియా డ్రామా కాదని, త్వరలోనే తుర్కియేతో దౌత్య సంబంధాలు తెంచుకుంటామని హెచ్చరించారు. "వెన్నుపోటు పొడిచే స్నేహితుడు ఎవరికి కావాలి?" అని ప్రశ్నించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఉగాండా పౌరులు తుర్కియేకి వెళ్లవద్దని ఆయన సూచించారు.

ఇదే సమయంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఆయన మరో వివాదాస్పద ప్రకటన చేశారు. "దేవుడైన జీసస్ క్రైస్ట్ పవిత్ర భూమిని రక్షించడానికి, నా ఆధ్వర్యంలో లక్ష మంది ఉగాండా సైనికులను ఇజ్రాయెల్‌కు పంపడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని ప్రకటించారు.

కైనెరుగబా ఇలాంటి విచిత్రమైన ప్రకటనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. 2022 అక్టోబర్‌లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీని వివాహం చేసుకునేందుకు ప్రతిఫలంగా 'భూమిపై అత్యంత అందమైనవి'గా వర్ణించిన 100 అంకోలే ఆవులను ఇస్తానని బహిరంగంగా ప్రకటించి ఆయన వార్తల్లో నిలిచారు.
Go Back to Shorts
Muhoozi Kainerugaba
Uganda
Turkey
Billion dollars
Uganda army chief
Turkey relations
Somalia
Al-Shabaab
Security dividend
Israel

More Telugu News