టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డకు భారీ ఊరట... విదేశాలకు వెళ్లేందుకు కోర్టు గ్రీన్ సిగ్నల్

Yarlagadda Venkata Rao Gets Court Nod to Visit Abroad
గత ప్రభుత్వ హయాంలో ఎదురైన కేసులు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఈ కేసుల కారణంగా ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన అమెరికా పర్యటనకు తీవ్ర ఆటంకాలను ఎదుర్కొన్నారు. అయితే, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం పలు కఠినమైన షరతులతో ఆయన విదేశీ పర్యటనకు మచిలీపట్నం ఎస్సీ, ఎస్టీ జిల్లా కోర్టు అనుమతి మంజూరు చేసింది. దీంతో ఆయనకు ఊరట లభించినట్లయింది.

గత రెండేళ్లుగా అమెరికాలో ఉన్న తన వ్యాపార కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు యార్లగడ్డ వెంకట్రావు ప్రయత్నిస్తున్నారు. అయితే, గత ప్రభుత్వ కేసులను కారణంగా చూపుతూ న్యాయస్థానాలు ఆయన విదేశీ పర్యటనకు అనుమతులు నిరాకరిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి కోర్టును ఆశ్రయించగా, ఈసారి సానుకూల స్పందన లభించింది. అయితే, న్యాయస్థానం పర్యటనకు అనుమతి ఇస్తూనే పలు కఠినమైన నిబంధనలను విధించింది. ఈ నిబంధనలన్నీ పక్కాగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

కోర్టు విధించిన షరతుల ప్రకారం.. యార్లగడ్డ తరఫున నలుగురు వ్యక్తులు పూచీకత్తు సమర్పించాలి. అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు, అక్కడ ఏ ప్రాంతంలో, ఏ చిరునామాలో ఉంటారనే పూర్తి వివరాలను లిఖితపూర్వకంగా కోర్టుకు తప్పనిసరిగా అందించాలి. ఇక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి వచ్చేవరకు తన సెల్ ఫోన్‌ను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 జులై 15 తేదీలోపు తిరిగి భారతదేశానికి రావాలి. కోర్టు అనుమతుల పొడిగింపునకు ఎలాంటి ప్రయత్నం చేయకూడదని, అనుమతిలోని షరతులను ఉల్లంఘించరాదని న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

దేశానికి తిరిగి వచ్చిన వారం రోజుల్లోపు కచ్చితంగా కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ అమెరికా పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయస్థానం నుంచి అనుమతులు లభించడంతో, ఈ నెలాఖరులో అమెరికాకు వెళ్లేందుకు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Go Back to Shorts
Yarlagadda Venkata Rao
Yarlagadda
TDP MLA
Gannavaram
Andhra Pradesh Politics
Court Order
America Visit
Foreign Travel
Case Relief

More Telugu News