గుడ్ న్యూస్ చెప్పిన టీసీఎస్... కొత్తగా 25 వేల మంది ఫ్రెషర్లకు అవకాశం
- ఈ ఆర్థిక సంవత్సరంలో 25 వేల మంది ఫ్రెషర్లను నియమించుకోనున్న టీసీఎస్
- గత ఏడాది 44 వేల మందికి అవకాశాలు కల్పించిన సంస్థ
- వ్యాపార అవసరాలను బట్టి నియామకాల సంఖ్య పెరిగే అవకాశం
- ఉద్యోగుల తొలగింపులు ఉండవని స్పష్టం చేసిన సీఈఓ
గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో టీసీఎస్ 44 వేల మంది ఫ్రెషర్లకు అవకాశాలు కల్పించింది. గత మూడేళ్లుగా ఏటా సగటున 40 వేల మందికి పైగా కొత్తవారిని నియమించుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా నియామకాలపై కంపెనీ ఎండీ, సీఈఓ కృతి వాసన్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామక వ్యూహాలు మారుతుంటాయని ఆయన తెలిపారు.
ఫ్రెషర్లకు శిక్షణ ఇచ్చి ప్రాజెక్టులకు సిద్ధం చేయడానికి సుమారు 9 నెలల సమయం పడుతుందని, అదే అనుభవజ్ఞులైన ఉద్యోగులు వెంటనే విధుల్లో చేరిపోతారని కృతి వాసన్ వివరించారు. గత ఏడాది సీనియర్ ఉద్యోగుల తొలగింపుల గురించి ప్రస్తావించగా, భవిష్యత్తులో అలాంటి తొలగింపులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. మంచి పనితీరు కనబరిచే ఉద్యోగులకు ఎలాంటి ఢోకా ఉండదని, ఖర్చుల తగ్గింపు లేదా ఏఐ కారణంగా తొలగింపులు జరగలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐటీ రంగంలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.