తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే హవా!

Telangana Inter Results 2026 Released K Kesava Rao Announces Pass Percentage
లక్షలాది మంది విద్యార్థుల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షల ఫలితాలు-2026 విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంబంధాల సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. ఈ ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 70.58 శాతం మంది పాసయ్యారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించి తమ సత్తా చాటారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అనంతరం మార్చి 15 నుంచి ఏప్రిల్ 1వ తేదీ మధ్య 20 కేంద్రాల్లో సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేసి, వేగంగా ఫలితాలను సిద్ధం చేశారు.

వెబ్‌సైట్లు, వాట్సాప్‌లోనూ ఫలితాలు
విద్యార్థులు తమ ఫలితాలను సులభంగా తెలుసుకునేందుకు ఇంటర్ బోర్డు పలు మార్గాలను అందుబాటులోకి తెచ్చింది. అధికారిక వెబ్‌సైట్లయిన `tgbie.cgg.gov.in`, `results.cgg.gov.in`లను సందర్శించి, తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ప్రత్యేకంగా వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే సౌకర్యాన్ని కల్పించారు. `8096958096` నంబర్‌కు వాట్సాప్‌లో 'Hi' అని మెసేజ్ పంపి, సూచనలను అనుసరించి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అక్కడే మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది.

మే నెలలో సప్లిమెంటరీ పరీక్షలు
వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల కోసం మే నెలలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు. వీటి ఫలితాలను కూడా అదే నెల చివరికల్లా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు స్పష్టం చేశారు.
Go Back to Shorts
TG Inter Results
Telangana Inter Results 2026
K Kesava Rao
Inter Results Telangana
Telangana Education
Yogita Rana
Telangana Board of Intermediate Education
Supplementary Exams
Inter Exams
Girls outperform boys

More Telugu News