కడప జిల్లాలో కలకలం... ప్రేమోన్మాదిపై పోలీసుల కాల్పులు

కడప జిల్లా ఖాజీపేటలో తనను ప్రేమించలేదన్న కక్షతో రామకీర్తన అనే విద్యార్థినిని హత్య చేసిన నిందితుడు వెంకటేశ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి, పోలీసులపైనే దాడి చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే, రామకీర్తన హత్య కేసులో అరెస్టయిన వెంకటేశ్‌ను పోలీసులు మైదుకూరు నుంచి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలో బాసాపురం చెక్‌పోస్ట్ సమీపంలో అతను పోలీసుల నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అడ్డుకోబోయిన పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. ఈ దాడిలో ఇద్దరు పోలీసు సిబ్బంది గాయపడ్డారు.

ఈ ఘటనపై కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ స్పందిస్తూ, "లొంగిపొమ్మని హెచ్చరించి, సీఐ గాల్లోకి కాల్పులు జరిపినా నిందితుడు వినలేదు. దీంతో ఆత్మరక్షణ కోసం సీఐ వంశీధర్ అతని మోకాలి కింది భాగంలో కాల్పులు జరపాల్సి వచ్చింది" అని వివరించారు. ప్రేమను నిరాకరించిందనే కోపంతోనే వెంకటేశ్, రామకీర్తన గొంతు కోసి హత్య చేశాడని ఎస్పీ తెలిపారు.

ఈ హత్య ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం గాయపడిన వెంకటేశ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Venkatesh
Kadapa district
Ramakeerthana murder case
Khajipet
Police encounter
AP crime news
Nacheket Vishwanath
Chandrababu Naidu
Crime news Andhra Pradesh
ప్రేమించడం లేదు

More Telugu News