అప్పుల బాధ తట్టుకోలేక అమెరికా నుంచి వెళ్లిపోయిన బైడెన్ కుమారుడు

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. భారీ అప్పులు చెల్లించలేక ఆయన అమెరికాను విడిచి విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తన మాజీ న్యాయవాదులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిల కేసు విచారణ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

హంటర్ బైడెన్ ప్రస్తుతం దేశంలో లేరని, విదేశాల్లో నివసిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది బ్యారీ కోబర్న్ కోర్టుకు తెలిపారు. అయితే, ఆయన కచ్చితంగా ఎక్కడ ఉన్నారనే సమాచారం తన వద్ద కూడా లేదని పేర్కొన్నారు. విన్‌స్టన్ అండ్ స్ట్రాన్ అనే న్యాయవాద సంస్థకు హంటర్ సుమారు 50,000 డాలర్లు (దాదాపు రూ. 43 లక్షలు) బాకీ పడ్డారు. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకే ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది.

హంటర్ మొత్తం అప్పులు 17 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 158 కోట్లు) పైగా ఉన్నాయని గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఈ అప్పుల్లో ఎక్కువ భాగం న్యాయపరమైన ఖర్చులే కావడం గమనార్హం. ఆయనపై ఇప్పటికే తుపాకీ కొనుగోలు సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు, పన్ను ఎగవేత కేసులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తలదాచుకుంటున్నట్లు అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. గత ఏడాది ఆయన తన భార్యతో కలిసి దక్షిణాఫ్రికాలో కనిపించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. తాజా పరిణామాలతో బైడెన్ కుటుంబం మరోసారి వార్తల్లో నిలిచింది.

Hunter Biden
Joe Biden
Hunter Biden debts
Hunter Biden financial issues
Hunter Biden South Africa
Hunter Biden tax evasion
Biden family
US News
American Politics
Hunter Biden legal fees

More Telugu News