కృష్ణలంకలో అమానుషం.. పబ్లిక్ టాయిలెట్‌లో పసికందును వదిలివెళ్లిన మహిళ

విజయవాడలో ఓ అమానుష ఘటన తీవ్ర కలకలం రేపింది. కన్నపేగు బంధాన్ని మరిచిన ఓ మహిళ, ముక్కుపచ్చలారని పసిబిడ్డను పబ్లిక్ టాయిలెట్‌లో వదిలి వెళ్లిపోయింది. నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో వెలుగు చూసిన ఈ సంఘటన స్థానికంగా అందరినీ కలిచివేసింది.

వివరాల్లోకి వెళితే... కృష్ణలంకలోని పబ్లిక్ టాయిలెట్‌కు ఓ మహిళ తన బిడ్డతో వచ్చింది. లోపలికి వెళ్లాక, పాపను కింద పడుకోబెట్టి, ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఓ బకెట్‌ను అడ్డుగా పెట్టి అక్కడి నుంచి పరారైంది. కాసేపటి తర్వాత టాయిలెట్‌ను శుభ్రం చేసేందుకు వెళ్లిన శానిటరీ సిబ్బంది పాప ఏడుపు విని చూడగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కృష్ణలంక పోలీసులు పసికందును వైద్యం కోసం పాత ప్రభుత్వ ఆసుప‌త్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా మహిళ ప్రయాణించిన ఆటోను గుర్తించి, డ్రైవర్‌ను విచారించారు. ఆమె ఆటోలో వచ్చి, పాపను వదిలేశాక నేరుగా రైల్వేస్టేషన్‌కు వెళ్లి ఓ రైలు ఎక్కి పారిపోయినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

ఆ మహిళ ఎవరు? ఆమె సొంత బిడ్డేనా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.



Vijayawada
Krishna Lanka
abandoned baby
public toilet
crime news
child helpline 1098
Andhra Pradesh police
railway station
CCTV footage
old government hospital

More Telugu News