వైభవ్ సూర్యవంశీ వీరబాదుడు.. ఆర్సీబీకి తొలి ఓటమి

Vaibhav Suryavanshi Blistering Knock Leads Rajasthan Royals to Victory
షార్ట్స్‌లో చూడండి
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో తమ అజేయ యాత్రను కొనసాగిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా, ఆర్సీబీకి తొలి ఓటమి ఎదురైంది.

బెంగళూరు నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు చేసి రాజస్థాన్ విజయానికి బలమైన పునాది వేశాడు. ధ్రువ్ జురెల్‌తో కలిసి కేవలం 37 బంతుల్లోనే 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పవర్‌ప్లేలో ఈ జోడీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి స్కోరును 97/1కి చేర్చింది. గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన స్టార్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్‌లను సూర్యవంశీ లక్ష్యంగా చేసుకుని పరుగులు రాబట్టాడు. ఈ టోర్నీలో అతనికిది రెండో 15 బంతుల హాఫ్ సెంచరీ కావడం విశేషం.

సూర్యవంశీ ఔటైన తర్వాత రాజస్థాన్ 129/1 నుంచి 134/4కి పడిపోయి కాస్త తడబడింది. అయితే, మరో ఎండ్‌లో ధ్రువ్ జురెల్ 43 బంతుల్లో 81 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి తొలి బంతికే జోఫ్రా ఆర్చర్ షాకిచ్చాడు. ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను డకౌట్ చేశాడు. విరాట్ కోహ్లీ (32) వేగంగా ఆడినా, రవి బిష్ణోయ్ (2/32), ఆర్చర్ (2/33) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆర్సీబీ 125/7తో కష్టాల్లో పడింది. ఆ దశలో కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63), రొమారియో షెపర్డ్ (11 బంతుల్లో 22), చివర్లో వెంకటేశ్ అయ్యర్ (29) రాణించడంతో ఆర్సీబీ 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, సూర్యవంశీ, జురెల్ భాగస్వామ్యం ముందు ఈ స్కోరు సరిపోలేదు.
Go Back to Shorts
Vaibhav Suryavanshi
Rajasthan Royals
RCB
IPL 2024
Dhruv Jurel
Rajat Patidar
Jos Hazlewood
Virat Kohli
Indian Premier League

More Telugu News