నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో!

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం భారీ అడుగులు వేసింది. శుక్రవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.  సుమారు రూ.39,436 కోట్ల విలువైన పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. నేటి క్యాబినెట్ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు.

విశాఖపై ప్రత్యేక దృష్టి.. ఐటీ, డేటా సెంటర్ల హబ్

రాష్ట్ర క్యాబినెట్ విశాఖపట్నంను ఐటీ, డేటా సెంటర్ల హబ్‌గా మార్చేందుకు పలు కీలక ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అదానీ ఇన్‌ఫ్రా, రైడెన్ ఇన్ఫోటెక్ (గూగుల్ అనుబంధ సంస్థ) ఏర్పాటు చేయనున్న ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సంబంధించి భూమిని 'సేల్ అగ్రిమెంట్' బదులుగా 'సేల్ డీడ్' కింద రిజిస్టర్ చేసేందుకు ఆమోదం తెలిపింది.

అలాగే, విశాఖలో ఐటీ పార్క్ ఏర్పాటుకు క్రెడెన్స్ రియాలిటీ సంస్థకు అనుమతినిచ్చింది. దీని ద్వారా రూ.386.88 కోట్ల పెట్టుబడి, 6,500 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఫ్యూజీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు 2 ఎకరాల భూమి కేటాయింపుతో రూ.425 కోట్ల పెట్టుబడి, 2,500 ఉద్యోగాలకు; సిటెక్ డేటా లిమిటెడ్‌కు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కోసం 40 సెంట్ల భూమి కేటాయింపుతో రూ.1,800 కోట్ల పెట్టుబడికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఎలక్ట్రానిక్స్, లిథియం బ్యాటరీల తయారీకి ఊతం

ఎలక్ట్రానిక్స్, అధునాతన సాంకేతిక పరికరాల తయారీ రంగంలో రాష్ట్రానికి పెద్దపీట వేస్తూ క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది. పీజీ టెక్నో ప్లాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఏసీల తయారీ యూనిట్‌ను విస్తరించనుంది. రూ.1,305 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టు ద్వారా 2,910 మందికి ఉపాధి లభించనుంది. 

మరోవైపు, చిత్తూరు జిల్లా కుప్పంలో ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన ముడి పదార్థాల ప్రాజెక్టును ఎన్‌పీఎస్‌పీఎల్ స్పెషాలిటీ కెమికల్స్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 105 ఎకరాల భూమి కేటాయిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.2,550 కోట్ల పెట్టుబడి, 4,000 ఉద్యోగాలు రానున్నాయి.

సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు

ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంటున్న సెమీకండక్టర్ల తయారీ రంగంలో ఏపీ కీలక ముందడుగు వేసింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ (OSAT) ఫ్యాబ్రికేషన్ యూనిట్‌ను స్థాపించనుంది. ఇందుకోసం 60 ఎకరాల భూమి కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు పెట్టుబడి విలువ రూ.10,239.78 కోట్లు కావడం విశేషం. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన అనేక ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.

స్టీల్, భారీ పరిశ్రమలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ఉక్కు, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించింది. విశాఖపట్నంలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ తన ఐరన్ ఓర్ పెల్లెట్ ప్లాంట్ సామర్థ్యాన్ని 7 మిలియన్ టన్నుల నుంచి 11 మిలియన్ టన్నులకు విస్తరించనుంది. ఈ రూ.1,400 కోట్ల ప్రాజెక్టు ద్వారా 760 మందికి ఉపాధి లభించనుంది. నెల్లూరు జిల్లాలో శామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ రూ.3,678 కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 3,200 మందికి ఉద్యోగాలు రానున్నాయి.

దేశంలోనే తొలిసారి.. అమరావతిలో క్వాంటం వ్యాలీ

భవిష్యత్ సాంకేతికత అయిన క్వాంటం కంప్యూటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అమరావతిలో 'క్వాంటం వ్యాలీ' ఏర్పాటులో భాగంగా సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ఆధ్వర్యంలో ఇన్నోవేషన్ హబ్, హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సౌకర్యానికి ఆమోదం తెలిపింది. 

క్వాంటం ఏఐ గ్లోబల్, పీక్యూ స్టేషన్ వంటి సంస్థలు కూడా తమ ప్రాజెక్టులను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాయి. దేశంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించినా, ఏ రాష్ట్రం ముందుకు రాని తరుణంలో చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ముందడుగు వేస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు.

విద్యా, పరిపాలన రంగాల్లో కీలక సంస్కరణలు

పరిశ్రమలతో పాటు విద్య, పరిపాలన రంగాల్లోనూ క్యాబినెట్ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు నిబంధనలను సరళతరం చేస్తూ 'ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్-2016'కు సవరణలు చేసింది. దీని ప్రకారం యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని 50 ఎకరాల నుంచి పట్టణ ప్రాంతాల్లో 10, ఇతర ప్రాంతాల్లో 15 ఎకరాలకు తగ్గించారు. 

ఎండోమెంట్ ఫండ్‌ను రూ.15 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గించారు. అలాగే, ఉద్యోగ నియామకాలకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు-1975 స్థానంలో 'ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ ఆర్డర్-2025'ను అమలు చేసేందుకు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం రాష్ట్రాన్ని 4 జోన్ల నుంచి 6 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా పునర్వ్యవస్థీకరించారు.

పర్యాటకం, ఇరిగేషన్, ఇతర కీలక ఆమోదాలు

రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణకు పీపీపీ పద్ధతిలో 'అడాప్ట్ ఏ మాన్యుమెంట్' పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అకాడమీ నిర్మాణ గడువును 2028 జూన్ వరకు పొడిగించింది. విజయవాడలో నిరుపయోగంగా ఉన్న రైతు బజార్ స్థలాన్ని ఆధునిక పుష్పాల మార్కెట్‌గా మార్చేందుకు, పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల సవరించిన అంచనాలకు, భారత్ డైనమిక్స్ వంటి సంస్థలకు భూ కేటాయింపుల్లో ఎదురైన సమస్యల పరిష్కారానికి కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 

అదే సమయంలో, 2017లో కేటాయించిన భూమిలో పరిశ్రమ పెట్టని వీరవాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్ కేటాయింపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Chandrababu Naidu
Andhra Pradesh
AP Cabinet Decisions
Visakhapatnam
IT Hub
Data Centers
Lithium Batteries
Semiconductors
Quantum Valley
Industrial Investments

More Telugu News