పెళ్లికి ఒప్పుకోలేదని బలవంతంగా హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది... యువతి ఆత్మహత్య

నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని ప్రియుడు హెచ్‌ఐవీ సోకిన రక్తాన్ని ఎక్కించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన జరిగింది.

వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లాకు చెందిన మనోహర్ (24), తన మరదలైన 20 ఏళ్ల యువతి చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం కూడా నిశ్చయమైంది. అయితే, పెళ్లికి ముందు నిర్వహించిన వైద్య పరీక్షల్లో మనోహర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. యువకుడి తల్లిదండ్రులు హెచ్ఐవీ పాజిటివ్ వ్యక్తులు కావడంతో, యువతి తండ్రి ముందు జాగ్రత్తగా యువకుడికి కూడా టెస్ట్ చేయించాడు. దాంతో అతడికి కూడా హెచ్ఐవీ సోకిన విషయం వెల్లడైంది. దీంతో యువతి కుటుంబం ఈ పెళ్లిని రద్దు చేసుకుంది.

దీన్ని తట్టుకోలేని మనోహర్, తన ప్రియురాలిపై కక్ష పెంచుకున్నాడు. యువతికి కూడా హెచ్‌ఐవీ సోకితే, ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరని, అప్పుడు తనకే ఇచ్చి వివాహం చేస్తారని కిరాతకంగా ఆలోచించాడు. ఈ క్రమంలో గత నెల 11న, సిరంజిలో తన రక్తాన్ని నింపుకుని యువతి ఇంటికి వెళ్లాడు. ఆమె పెళ్లికి ఒప్పుకోకపోవడంతో బలవంతంగా ఆ రక్తాన్ని సిరంజి ద్వారా ఆమె శరీరంలోకి ఎక్కించి పరారయ్యాడు.

ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు మనోహర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. అయితే, జరిగిన ఘటనతో తీవ్ర మానసిక వేదనకు లోనైన బీటెక్ విద్యార్థిని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Manoher
HIV
HIV infected blood
suicide
crime
Telangana
love affair
marriage refusal
murder attempt
Pochampally

More Telugu News