వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... ఏడుగురు విద్యార్థుల సస్పెన్షన్

జూనియర్ విద్యార్థులను వేధించినట్లు రుజువు కావడంతో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ఏడుగురు థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. వారిని ఆరు నెలల పాటు క్లాసుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, కోర్సు పూర్తయ్యేంత వరకు హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించింది. ఈ మేరకు కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే.. కొందరు సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ సీనియర్ల గురించి వాట్సాప్ గ్రూప్‌లో కొన్ని కామెంట్లు చేశారు. ఇది తెలుసుకున్న సీనియర్లు ఆగ్రహంతో జూనియర్లను హాస్టల్ టెర్రస్‌పైకి పిలిపించారు. వారిని మోకాళ్లపై నిలబెట్టి క్షమాపణ చెప్పించారు. ఈ ఘటనను కొందరు జూనియర్లు తమ ఫోన్లలో రహస్యంగా వీడియో తీశారు.

అనంతరం, నేరుగా వీడియో ఆధారాలతో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్ఎంసీ, విచారణ జరపాలని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ)ను ఆదేశించింది. డీఎంఈ ఆదేశాలతో కేఎంసీ ప్రిన్సిపాల్, యాంటీ ర్యాగింగ్ కమిటీతో విచారణ చేపట్టారు. రెండు రోజుల పాటు విచారణ జరిపిన కమిటీ, ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య ఏడుగురు విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేశారు.

Kakatiya Medical College
Warangal
KMC Warangal
Ragging
Medical College Ragging
NMC
National Medical Commission
Student Suspension
Anti Ragging Committee

More Telugu News