కృష్ణపట్నం తీరంలో హై అలర్ట్: తమిళనాడు బోటు సీజ్
నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు సముద్ర తీరంలోకి అక్రమంగా చొరబడిన తమిళనాడుకు చెందిన ఒక బోటును టాస్క్ ఫోర్స్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీర ప్రాంత భద్రతపై జారీ చేసిన కఠిన ఆదేశాల నేపథ్యంలో, గత కొద్ది రోజులుగా ఇక్కడ నిఘా నీడ ముమ్మరమైంది. ఈ క్రమంలోనే తాజాగా పట్టుబడిన బోటుతో కలిపి ఇప్పటి వరకు మొత్తం నాలుగు అక్రమ బోట్లను అధికారులు స్వాధీనం చేసుకోవడం తీర ప్రాంతంలో కలకలం రేపుతోంది.
ఆధునిక నిఘా పరికరాలు, థర్మల్ కెమెరాల సహాయంతో 24 గంటల పాటు గస్తీ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్ బృందాలు, అనుమానాస్పద కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా పట్టుబడిన బోట్లన్నింటినీ ప్రస్తుతం జువ్వలదిన్నె హార్బర్‌కు తరలించి, చొరబాటు వెనుక ఉన్న కారణాలపై లోతైన విచారణ జరుపుతున్నారు.