ఇంధన కొరత ఆందోళనల నేపథ్యంలో ఖతార్‌కు వెళుతున్న కేంద్రమంత్రి

ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఆందోళనలు నెలకొన్న తరుణంలో, కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ వెళ్లనున్నారు. వారాంతంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా యూఏఈలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 9, 10 తేదీలలో హర్దీప్ సింగ్ పూరి ఖతార్‌లో పర్యటిస్తారని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రిత్వ శాఖ 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తోంది. అయితే భారతదేశం వద్ద మాత్రం తగినంత నిల్వలు ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమై దాదాపు 45 రోజులు అవుతోంది. యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఖతార్‌పై క్షిపణి దాడులు నిర్వహించింది. దీనితో 17 శాతం వాటా ఉన్న ఖతార్ ఎల్ఎన్‌జీ ఎగుమతులపై ప్రభావం పడిందని ఖతార్ ఎనర్జీ సీఈవో సాద్ ఆల్-కాబి తెలిపారు.

ఇరాన్ దాడి వల్ల సంవత్సరానికి 12.8 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీని ఉత్పత్తి చేసే సామర్థ్యం దెబ్బతిన్నట్లు తెలిపారు. వీటి మరమ్మతులకు మూడు నుంచి ఐదు సంవత్సరాల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. ఎగుమతులు నిలిచిపోవడంతో ఖతార్ సంవత్సరానికి 20 బిలియన్ డాలర్ల మేర నష్టపోతుందని అంచనా వేసినట్లు తెలిపారు.

ఈ ప్రకటన ప్రపంచ ఇంధన కొరత ఆందోళనకు దారితీసింది. ఖతార్ నుంచి ఎల్ఎన్‌జీని దిగుమతి చేసుకునే యూరప్, ఆసియా దిగుమతిదారులలో ఆందోళన నెలకొంది. పారిశ్రామిక ప్రయోజనాల కోసం వినియోగించే ఎల్ఎన్‌జీ కోసం భారత కంపెనీలు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించాయి. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. 2025లో భారత్ సుమారు 25.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీని దిగుమతి చేసుకుంది. 2030 నాటికి దేశ ప్రాథమిక ఇంధన అవసరాల్లో సహజవాయువు వాటాను 15 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Hardeep Singh Puri
Qatar
India energy crisis
LNG imports
Iran Qatar missile attack
natural gas

More Telugu News