మహిళల గౌరవం గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు: టీడీపీ మహిళా నేత గుంటుపల్లి శ్రీదేవి చౌదరి

YSRCP Has No Right to Speak About Womens Respect TDP Leader Guntupalli Sridevi Choudary
షార్ట్స్‌లో చూడండి
మహిళల గౌరవం, వారి భద్రత గురించి మాట్లాడే నైతిక అర్హతను వైసీపీ ఎప్పుడో కోల్పోయిందని రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి చౌదరి తీవ్రస్థాయిలో విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం మహిళలను కవచంగా వాడుకుంటూ వైసీపీ నాయకులు నాటకాలాడుతున్నారని ఆమె ఘాటుగా ఆరోపించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఎండగట్టారు. నిజంగా మహిళలపై గౌరవం ఉంటే, గతంలో జరిగిన దారుణ అవమానాలపై ఆ పార్టీ నేతలు ఎందుకు నోరు మెదపలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు.

అసెంబ్లీ వేదికగా మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడినప్పుడు నవ్వులు చిందించిన వారే, ఇప్పుడు నకిలీ సెంటిమెంట్‌తో రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనని శ్రీదేవి చౌదరి ఎద్దేవా చేశారు. "నారా భువనేశ్వరి గారిని, నారా బ్రహ్మణి గారిని, ప్రస్తుత హోం మంత్రి అనిత గారిని, అమరావతి ఉద్యమంలో పాల్గొన్న ఆడపడుచులను దారుణంగా అవమానించినప్పుడు వైసీపీ మహిళా నాయకులంతా ఎక్కడ దాక్కున్నారు?" అని ఆమె నిలదీశారు. కన్నతల్లి లాంటి వారిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టినప్పుడు మౌనంగా ఉన్నవారు, ఇప్పుడు ఒక చిన్న పదాన్ని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయడం వారి రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

ఇటీవల ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రజల చేతిలో గట్టిగా దెబ్బతిన్నా కూడా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని శ్రీదేవి చౌదరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించగానే, ప్రజల దృష్టిని పక్కదారి పట్టించేందుకు జగన్ కొత్త డ్రామాలకు తెరలేపారని ఆరోపించారు. "ప్రజల దృష్టిని మళ్లించేందుకు జగన్ కు మళ్లీ 'మావిగన్' గుర్తుకొచ్చింది. దానికి తోడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనాన్ని అడ్డం పెట్టుకుని, రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కనపెట్టి కావాలనే రచ్చ చేస్తున్నారు" అని దుయ్యబట్టారు.

రాజధాని అమరావతికి రాష్ట్ర ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతున్నా, ఈ నిజాన్ని తమ పార్టీ అధినేతకు చెప్పే ధైర్యం లేని నాయకులు బయటకొచ్చి సవాళ్లు విసరడం సిగ్గుచేటని ఆమె పేర్కొన్నారు. పార్టీలో అంతర్గతంగా చర్చించే సత్తా లేనివారు, బయట ధర్నాలు చేస్తూ హంగామా సృష్టించడం వారి రాజకీయ దివాళాకోరుతనానికి స్పష్టమైన నిదర్శనమని విమర్శించారు. 

ఇప్పటికైనా వైసీపీ నాయకులు ఈ ద్వంద్వ రాజకీయాలు, నాటకాలు కట్టిపెట్టి ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని, లేనిపక్షంలో ప్రజలే వారికి తగిన సమాధానం చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవని గుంటుపల్లి శ్రీదేవి చౌదరి తీవ్రంగా హెచ్చరించారు.
Go Back to Shorts
Guntupalli Sridevi Choudary
TDP
YSRCP
Andhra Pradesh Politics
Women's Respect
Amaravati
Nara Bhuvaneswari
Nara Brahmani
Home Minister Anitha
YS Jagan

More Telugu News