మా దేశం వెళ్లిపోతాం... విశాఖలో డీఆర్వోను ఆశ్రయించిన ఇరాన్ యువతులు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం విశాఖపట్నంలో చదువుకుంటున్న ఇరాన్ విద్యార్థినులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తమ దేశంలోని కుటుంబ సభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో, వారి సమాచారం తెలియక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తమను సురక్షితంగా స్వదేశానికి పంపేందుకు సహాయం చేయాలని కోరుతూ వారు విశాఖ జిల్లా అధికారులను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళితే, విశాఖ నగరంలో డీఫార్మసీ చదువుతున్న కొందరు ఇరాన్ యువతులు జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) విశ్వేశ్వరనాయుడిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. యుద్ధం కారణంగా ఇరాన్‌లోని తమ కుటుంబాలతో మాట్లాడలేకపోతున్నామని, వారి యోగక్షేమాల గురించి సమాచారం తెలియక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నామని వివరించారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో తాము ఇక్కడ ఉండలేమని, తమను వీలైనంత త్వరగా తిరిగి ఇరాన్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను వేడుకున్నారు. విద్యార్థినుల విజ్ఞప్తిని స్వీకరించిన అధికారులు, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. 


Iran Students
Visakhapatnam
Iran
Middle East Conflict
War Crisis
Indian Education
District Revenue Officer
Student Distress
Repatriation
D Pharmacy

More Telugu News