ఘర్ వాపసీ తర్వాత మాజీ మిస్ ఇండియా ఎర్త్ అదృశ్యం.. పూణెలో కలకలం

Sayali Surve Former Miss India Earth Missing After Ghar Wapsi
షార్ట్స్‌లో చూడండి
మిస్ ఇండియా ఎర్త్ 2019 విజేత సాయ్లీ సర్వే అదృశ్యం కావడం పూణెలోని పింప్రి-చించ్‌వాడ్‌లో కలకలం రేపుతోంది. తన భర్తపై 'లవ్ జిహాద్', గృహహింస ఆరోపణలు చేసి, హిందూమతంలోకి తిరిగివచ్చిన (ఘర్ వాపసీ) కొన్ని రోజులకే ఆమె తన నలుగురు పిల్లలు సహా కనిపించకుండా పోయారు. తన కుమార్తెను, మనవళ్లను అత్తింటివారే కిడ్నాప్ చేశారని సాయ్లీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఎవరీ సాయ్లీ సర్వే?.. ఏం జరిగింది?
ఏవియేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన సాయ్లీ సర్వే మోడలింగ్ రంగంలో రాణించి 2019లో మిస్ ఇండియా ఎర్త్ కిరీటాన్ని గెలుచుకున్నారు. కొన్నేళ్ల క్రితం ఆమె తన కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా ముస్లిం వ్యాపారవేత్త అయిన అతిఫ్ టసేను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇందుకోసం ఇస్లాం మతం స్వీకరించి, తన పేరును అతీజా టసేగా మార్చుకున్నారు. అయితే, పెళ్లైన కొద్ది కాలానికే భర్త, అత్తింటివారి నుంచి తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొన్నానని ఆమె ఆరోపించారు. తన జీవితంలో అతిఫ్‌ను పెళ్లి చేసుకోవడమే అతిపెద్ద తప్పిదమని ఆమె పేర్కొన్నారు.

'లవ్ జిహాద్' ఆరోపణలు.. ఘర్ వాపసీ
కొన్ని వారాల క్రితం పింప్రి-చించ్‌వాడ్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో సాయ్లీ సర్వే శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి హిందూమతంలోకి వచ్చారు. ఈ సందర్భంగా తన పేరును ఆద్యా సర్వేగా మార్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మేధా కులకర్ణి, ఎమ్మెల్యే ఉమా ఖప్రే, భజరంగ్ దళ్ సభ్యులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ "ఇది కచ్చితంగా లవ్ జిహాద్ వ్యవహారమే. 24 గంటలూ తిట్లు, కారణం లేకుండా దెబ్బలు తింటుంటే, మొదట్లో అసాధారణంగా అనిపించిన విషయాలు కూడా సాధారణమైపోతాయి. నా నలుగురు పిల్లల కోసమే ఇన్నేళ్లు ఓపిక పట్టాను" అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం జరిగిన కొన్ని రోజులకే సాయ్లీ తన నలుగురు పిల్లలు సహా అదృశ్యమయ్యారు. దీంతో ఆమె తల్లిదండ్రులు పింప్రి-చించ్‌వాడ్ పోలీసులను ఆశ్రయించారు. టసే కుటుంబ సభ్యులే తమ కుమార్తెను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాయ్లీ ఘర్ వాపసీకి మద్దతుగా నిలిచిన హిందూ సంఘాలు ఈ ఘటనపై ఆందోళనలు చేపట్టి, ఆమెను వెంటనే కనిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను సాయ్లీ అత్తగారైన గుల్షన్ టసే ఖండించారు.  
Go Back to Shorts
Sayali Surve
Miss India Earth
Pune
Pimpri Chinchwad
Love Jihad
Ghar Wapsi
Ateef Tase
Gulshan Tase
Kidnapping

More Telugu News