Donald Trump: కాల్పుల విరమణ ప్రతిపాదన తిరస్కరించిన ఇరాన్!..రాత్రికి రాత్రే తుడిచిపెడతామని ట్రంప్ హెచ్చరిక

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి వరకు గడువు విధిస్తున్నామని, ఆలోగా దిగిరాకపోతే ఇరాన్‌ను ఒక్క రాత్రిలోనే పూర్తిగా ఆక్రమించుకోగలమని, నాశనం చేయగలమని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈజిప్టు, తుర్కియే, పాకిస్థాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహించి రూపొందించిన 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక విరామం శత్రువులు తిరిగి బలం పుంజుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, అందుకే తాము అంగీకరించబోమని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీనికి బదులుగా, యుద్ధానికి శాశ్వతంగా ముగింపు పలకాలనే డిమాండ్‌తో పాటు మొత్తం 10 షరతులతో కూడిన ప్రతిపాదనను పాకిస్థాన్ ద్వారా అమెరికాకు పంపినట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా, ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్‌జీసీ) ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి మాజిద్ ఖదేమీ, రహస్య దళం అధిపతి అస్గర్ బకేరీ సహా 25 మంది మరణించినట్లు సమాచారం.

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ తీవ్రంగా స్పందించారు. దాడులు, బెదిరింపులతో తమ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని, అమెరికా దాని మిత్రదేశాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఓ ప్రకటనలో హెచ్చరించారు. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్, ఖతార్, యూఏఈపై క్షిపణి దాడులు కొనసాగిస్తోంది. ట్రంప్ విధించిన గడువు సమీపిస్తుండటంతో తదుపరి ఏం జరగనుందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
 

Donald Trump
Iran
US Iran tensions
Iran Israel conflict
Middle East conflict
Majid Khademi
Asgar Bakeeri
Iran supreme leader
Mojtaba Khamenei
Ceasefire proposal

More Telugu News