Indian Nationals: పర్షియన్ గల్ఫ్ జలాల్లో ఇంకా 16 భారత నౌకలు, 433 మంది సిబ్బంది!

Indian Nationals 16 Indian Ships 433 Crew in Persian Gulf
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమ ఆసియా, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడున్న భారతీయుల భద్రత, తరలింపు ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 16 భారత నౌకలు, 433 మంది భారత నావికులు ఉన్నారని తెలిపింది. అయితే, గత రెండు రోజుల్లో 'గ్రీన్ శాన్వి', 'గ్రీన్ ఆశా' అనే రెండు ఎల్పీజీ నౌకలు హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటినట్టు స్పష్టం చేసింది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (డీజీ షిప్పింగ్), నౌకల యజమానులు, భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటివరకు 1,599 మంది భారత నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించామని, వీరిలో గత 24 గంటల్లో 120 మంది ఉన్నారని తెలిపింది. మరోవైపు, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని అన్ని పోర్టులలో కార్యకలాపాలు సాధారణంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతున్నాయని స్పష్టం చేసింది.

ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం చొరవతో ఇప్పటివరకు 1,777 మంది భారతీయులను ఆ దేశం నుంచి ఆర్మేనియా, అజర్‌బైజాన్‌లకు తరలించి, అక్కడి నుంచి స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేసింది. వీరిలో 895 మంది విద్యార్థులు, 345 మంది మత్స్యకారులు ఉన్నారు. ఈ మత్స్యకారులు ఏప్రిల్ 4న ఆర్మేనియా నుంచి చెన్నైకి చేరుకున్నారు. తరలింపు ప్రక్రియకు సహకరించిన ఇరాన్, ఆర్మేనియా, అజర్‌బైజాన్ ప్రభుత్వాలకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది.

ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి సుమారు 7,30,000 మంది ప్రయాణికులు భారత్‌కు తిరిగి వచ్చారు. యూఏఈ, సౌదీ అరేబియా, ఒమన్ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు పరిమిత సంఖ్యలో కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ వివరించింది. భారతీయుల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్రం పునరుద్ఘాటించింది.
Go Back to Shorts
Indian Nationals
Persian Gulf
Indian sailors
Operation Safe Return
Hormuz Strait
Iran
Armenia
Azerbaijan
Evacuation

More Telugu News