JD Chakravarthy: ఈ పాత్ర ఇంతవరకు కమల్ హాసన్ కు కూడా దొరకలేదు: జేడీ చక్రవర్తి
తన తాజా చిత్రం ‘గాయపడ్డ సింహం’ ప్రమోషన్లలో నటుడు జేడీ చక్రవర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో తన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో చెబుతూ, ఏకంగా విశ్వనటుడు కమల్ హాసన్ పేరును ప్రస్తావించారు. కమల్ హాసన్ తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు చేసినప్పటికీ, ‘గాయపడ్డ సింహం’లో తాను చేస్తున్నటువంటి విభిన్నమైన క్యారెక్టర్ ఆయనకు ఇప్పటివరకు దొరకలేదని పేర్కొన్నారు. అదే సమయంలో "కమల్ హాసన్ గారు ఒక అద్భుతం. ఆయన కాలి గోటికి కూడా నేను సరిపోను" అంటూ తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు.
ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ఫరియా అబ్దుల్లా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్వీకార్ అగస్తీ సంగీతం అందిస్తుండగా, పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరోవైపు, జేడీ చేసిన ఈ కామెంట్స్‌తో సినిమాలోని ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెటిజన్లలో పెరిగింది. ట్రోల్స్ వస్తాయని ముందే ఊహించిన జేడీ, తన పాత్రలోని డెప్త్ గురించి చెప్పడానికే ఈ ఉదాహరణ (కమల్) తీసుకున్నానని స్పష్టం చేశారు.